TDP: మారని టీడీపీ నేతల తీరు..!
తెలుగుదేశం పార్టీలో (TDP) అంతర్గత వ్యవహారాలు, ముఖ్యంగా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ (Praja Darbar) సందర్భంగా ఎమ్మెల్యేల అలసత్వం, ప్రజా సమస్యల పట్ల వారి నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్‌కు వేల సంఖ్యలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి తరలిరావడం చూసి ఆయన మండిపడ్డారు. సుమారు ఐదు గంటల పాటు ప్రజల సమస్యలను ఓపికగా విన్న లోకేష్, ఇంతమంది సమస్యలతో పార్టీ కార్యాలయానికి వచ్చారంటే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని, ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ ను గాలికి వదిలేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించడం లేదని మండిపడ్డారు, ఇకపై నియోజకవర్గాలతో పాటు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. పాత పద్ధతిలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు గ్రీవెన్స్ కు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. లోకేష్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉలిక్కిపడ్డారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యవహారంపై ప్రత్యేకంగా మండిపడ్డారు. పార్టీ కోసం సీటు త్యాగం చేసిన ఒక వ్యక్తి మరణించినా, కనీసం ఆ వైపు ఎమ్మెల్యే వెళ్లకపోవడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా, అధికార వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కూడా పార్టీ నేతలు వెనుకబడి ఉన్నారని ఆయన ఆక్షేపించారు. జోగి రమేశ్ అరెస్టుపై వైసీపీ బీసీ కార్డ్ ను పైకి తెచ్చి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే పార్టీలోని బీసీ నేతలు ఎందుకు మౌనంగా ఉండిపోయారని లోకేశ్ ప్రశ్నించారు. బీసీ నేతలు ఎందుకు తిప్పికొట్టలేదని సూటిగా ప్రశ్నించారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణపైనా లోకేష్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలు కూడా ఈ విధంగా వ్యవహరించడం పట్ల లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిదీ నేను, చంద్రబాబు చూసుకోవాలా? మీరంతా సీనియర్లుగా ఉండి ఏం చేస్తున్నారు? అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో సీనియర్ నాయకత్వంపై అధిష్టానం ఎంత తీవ్ర అసంతృప్తితో ఉందో తెలియజేస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ రక్షణ విషయంలో ఇకపై ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని లోకేష్ వ్యాఖ్యల ద్వారా టీడీపీ అధిష్టానం గట్టి సంకేతాలు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు పార్టీలో సీనియర్ నేతల పనితీరుపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.







