Nara Lokesh: బ్రిస్బేన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్

భారత్ – ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర
భారత్ లో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్
ఆస్ట్రేలియా (బ్రిస్బేన్): బ్రిస్బేన్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ ఎం.భాగోటియా ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (AIBC) ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… భారత్-ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పారు. 2022 డిసెంబర్ లో అమలులోకి వచ్చిన ఆస్ట్రేలియా-భారత్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (Economic Cooperation and Trade Agreement (ECTA) ఇరుదేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు గేమ్ ఛేంజర్ గా మారింది. 2020-21 ఇరుదేశాల నడుమ వస్తు వాణిజ్య కార్యకలాపాలు $12.2 బిలియన్ డాలర్లు ఉండగా, 2024-25 నాటికి దాదాపు రెట్టింపు అయి $24.10 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఆంధ్రప్రదేశ్ లో విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తోంది. ఫలితంగా గత 16నెలల కాలంలో ఏపీకి రూ.10లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల గూగుల్ సంస్థ విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారతదేశ చరిత్రలో అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఉంది. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1.35 లక్షల కోట్లతో అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోంది. ప్రస్తుతం భారత్ లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా మారింది. ఏపీలో పరిశ్రమదారుల కోసం సులభతరమైన పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నాం. వచ్చేనెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ – 2025కి హాజరై ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను తెలుసుకోవాల్సిందిగా ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.