KCR, Jagan : జనవరి నుంచి జనంలోకి కేసీఆర్, జగన్..!?

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నిత్యనూతనంగా ఉంటాయి. ప్రతిరోజూ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తే.. అప్పుడు మీరేం చేశారో చూడండంటూ అధికార పక్షాలు ఎత్తి చూపిస్తుంటాయి. ఇలా ఎప్పటికప్పుడు ప్రజలకు నిజాలు తెలిసిపోతుంటాయి. అయితే రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రతిపక్ష నేతలు యాక్టివ్ గా లేరు. జనంలోకి రాకుండే ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణలో (Telangana) కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జగన్.. పూర్తిగా ఇంటి నుంచే రాజకీయాలు నడిపిస్తున్నారు. అయితే జనవరి నుంచి వాళ్లిద్దరూ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంలో తాము చెప్పిన అన్ని పథకాలు అమలు చేశామని రేవంత్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే రేవంత్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. వాటిని సొమ్ము చేసుకోవడంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ (KCR) మాత్రం ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఆయన ఎప్పుడు బయటికొస్తారా అని కేడర్ అంతా వెయిట్ చేస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు. కేటీఆర్ (KTR) కాకుండా కేసీఆర్ ను ఉద్దేశించే మాట్లాడుతున్నారు. దీంతో కేసీఆర్ బయటికొస్తే నోరు విప్పితే రేవంత్ కు ముకుతాడు వేయొచ్చని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
గతంలో అసెంబ్లీలో ప్రమాణం చేసిన అనంతరం బీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ ఒకసారి మాట్లాడారు. ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని.. ఆ తర్వాతే స్పందించాలని ఆయన అన్నారు. ఇప్పుడు ఏడాది పూర్తయింది కాబట్టి స్పందించే సమయం వచ్చిందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్ రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది. వారానికోసారి బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని ఆయన భావిస్తున్నారట. అలాగే.. నెలకోసారి ఏదైనా జిల్లాలో పర్యటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కేసీఆర్ బయటికొస్తే కేడర్ లో ఎక్కడలేని జోష్ వస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు (Chandrababu) సర్కార్ కొలువుదీరి ఆరు నెలలైంది. అసెంబ్లీలో తగినంత బలం లేకపోవడంతో వైసీపీకి (YSRCP) ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. హోదా లేదు కాబట్టి తమకు మైక్ ఇవ్వరని భావించిన జగన్.. అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. వారానికి రెండ్రోజులు మీడియా ముందే తమ వైఖరిని వెల్లడిస్తామన్నారు. అలాగే చేస్తున్నారు కూడా. వారంలో రెండ్రోజులు జగన్ తాడేపల్లిలోని (Tadepalli) తన నివాసం నుంచే మీడియాతో మాట్లాడుతున్నారు. అయితే ఎంపిక చేసిన మీడియాతోనే జగన్ మాట్లాడుతున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు జగన్ జనంలోకి వస్తేనే కేడర్ లో జోష్ వస్తుందని.. అలా కాకుండా ఇంట్లో కూర్చుంటే ఉపయోగం ఉండదనే ఫీలింగ్ పార్టీ నేతల్లో ఉంది. ఓటమితో ఇప్పటికే చాలా మంది నేతలు, కార్యకర్తలు డల్ అయిపోయారు. అందుకే జగన్ జిల్లాలవారీగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి బుధ, గురువారాల్లో జిల్లాల్లోనే ఉండి సమీక్షిస్తానని చెప్పారు. ఇది కేడర్ లో కాస్త ఆశలు రేపింది. జగన్ జనంలోకి వస్తే మళ్లీ పార్టీ గాడిలో పడుతుందనే భావన కేడర్ లో ఉంది. మొత్తానికి కేసీఆర్, జగన్ జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతుండడంతో సంక్రాంతి తర్వాత రాజకీయాలు మరింత రక్తి కట్టిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.