Jagan: రాయలసీమ లిఫ్ట్ వివాదంలో జగన్ ఎంట్రీ ..చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) తొలిసారిగా స్పందించారు. గత నెల 21న తెలంగాణలో నీటి వినియోగంపై మాజీ సీఎం కేసీఆర్ (K. Chandrashekar Rao) చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టీకరణ ఇవ్వడం, ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ప్రకటనలు ఈ అంశాన్ని రెండు రాష్ట్రాల్లో రాజకీయ చర్చలకు దారి తీశాయి.
తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, కృష్ణా జలాల వినియోగంపై వివరణ ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తాను ఆపించానని వ్యాఖ్యానించారు. ఆ మాటలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. ఈ ప్రకటన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ (BRS), ఏపీలో టీడీపీ (TDP) వేర్వేరు రీతుల్లో స్పందించాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదని ఇరు పార్టీలూ ఖండించాయి. బీఆర్ఎస్ తరఫున మాజీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు (Harish Rao) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తమ వాదన వినిపించారు. మరోవైపు టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు. తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అన్న అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) చరిత్రలో చెడ్డపేరు మూటగట్టుకున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్‌ను తాను ఆపించానని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం వెనుక చంద్రబాబుతో ఉన్న అవగాహన ఒప్పందమే కారణమని జగన్ విమర్శించారు.
రాయలసీమ ప్రజల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు వెన్నుపోటు లాంటిదని జగన్ మండిపడ్డారు. శ్రీశైలంలో (Srisailam) నీటి మట్టం 881 అడుగుల వరకు ఉండాలని, పోతిరెడ్డిపాడు (Pothireddypadu) ద్వారా 7 వేల క్యూసెక్కుల నీరు రావాలంటే కనీసం 854 అడుగుల వద్ద నీటిని వినియోగించాల్సి ఉంటుందని వివరించారు. తమ హయాంలో పరిమితంగానే నీటిని వినియోగించామని, కానీ తెలంగాణలో కల్వకుర్తి (Kalwakurthy), పాలమూరు-రంగారెడ్డి (Palamuru–Rangareddy) వంటి ప్రాజెక్టులను భారీగా విస్తరించారని ఆరోపించారు.
కృష్ణా జలాలపై జరుగుతున్న ఈ రాజకీయాలు చివరికి నష్టపోయేది రాయలసీమ ప్రజలేనని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోవడం వల్లే రాయలసీమకు ఈ పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు నిర్ణయాల వల్లే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాయలసీమ లిఫ్ట్ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుని, రెండు రాష్ట్రాల మధ్య చర్చను కొత్త మలుపు తిప్పినట్లైంది.






