Jagan: ప్రజల్లోకి రాని జగన్.. నిరసిస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) లో ప్రస్తుతం అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేశారు. కానీ పిలుపు ఇచ్చిన జగన్ మాత్రం ఇంటికే పరిమితమైపోవడంతో, పార్టీ లోపల ఎంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కనీసం ఆందోళన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి కూడా ఆయన బయటికి రాలేదని, స్థానిక నాయకులు గుసగుసలాడుతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయాల్లో పార్టీ అధినేత ప్రజల్లోకి వస్తే, కార్యకర్తల్లో అపారమైన ఉత్సాహం వస్తుంది. కానీ, జగన్ తన పిలుపులకే హాజరుకాకపోవడం వారి ఉత్సాహాన్ని తగ్గిస్తున్నదని వైసీపీ కేడర్ కూడా భావిస్తోంది. గతంలో కూడా విద్యార్థుల సమస్యలపై నిర్వహించిన “ఫీజు పోరు”, రైతుల ఆందోళనలు, విద్యుత్ చార్జీలపై నిరసనలు… వీటిల్లో ఏ కార్యక్రమంలోనూ జగన్ పాల్గొనలేదని కొంతమంది నాయకులు అంతర్గత సమావేశాల్లో పేర్కొంటున్నారు.
జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజును “వెన్నుపోటు దినం”గా పాటించాలని పార్టీ నిర్ణయించినప్పుడు కూడా జగన్ ప్రజల్లోకి రాలేదని వారు గుర్తుచేస్తున్నారు. అధిష్ఠానం కీలక నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో కనిపించకపోవడం తో పార్టీ ఇచ్చిన పిలుపులో ఎంత నిబద్ధత ఉందో అందరికీ అర్థం అవుతుంది..అందుకే ప్రజలు పెద్దగా ఈ విషయాలపై దృష్టి పెట్టడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంక్షలను కూడా లేకచేయకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలు విస్తృతంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయటికి రాకపోవడం వల్ల, వారి పోరాటం ప్రభావం తగ్గిపోతుందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. జగన్ పాల్గొంటే ఆ నిరసనలకు విపరీతమైన ప్రచారం లభిస్తుందని, ప్రభుత్వం కూడా ఒత్తిడిని అనుభవించేదని వారి అభిప్రాయం.
కార్యకర్తలు జగన్ ఇచ్చిన పిలుపుకు గౌరవంతో వెంటనే స్పందిస్తున్నామని చెప్పారు. అయితే, అధినేత ప్రజల్లోకి రాకపోవడం వల్ల ఆందోళన కార్యక్రమాల బలహీనత బయటపడుతున్నదని వెల్లడిస్తున్నారు. పార్టీ అధినేత గళం ప్రజల్లో వినిపించకపోతే ప్రతిపక్షం శక్తివంతంగా నిలబడదని, జగన్ బయటకు వచ్చి ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తేనే పార్టీ పునరుద్ధరణ సాధ్యమని వారు భావిస్తున్నారు. అధికారం కోల్పోయి దాదాపు 18 నెలలు దాటినా, జగన్ రాజకీయ చురుకుదనం బయటపడడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లకపోతే పార్టీకి బలం చేకూరదని, పరిస్థితులు మారాలంటే జగన్ శైలిలో మార్పు అత్యవసరమని వారు స్పష్టంగా చెబుతున్నారు.






