చరిత్రలో ఎవరూ చేయని నష్టం జగన్ చేశారు : చంద్రబాబు

చరిత్రలో ఎవరూ చేయని నష్టం వైఎస్ జగన్ చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. ఒక్కసారి యువత ఆలోచన చేయాలన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో ఆంధ్రప్రదేశ్ పతనావస్థలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు జగన్‌కు సొంత లాభం తప్ప ప్రజాక్షేమం పట్టదని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని తెలిపారు.
రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సర్కార్‌ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలంటే ప్రజా చైతన్యం రావాలన్నారు. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. రెండున్నరేళ్లలో జగన్ రెడ్డి రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.5 లక్షల అప్పు భారం మోపారన్నారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని, రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.