ISRO: ఇస్రో ప్రయోగం విఫలం.. అంతరిక్షంలోకి చేరని ‘అన్వేష’!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం ఊహించని రీతిలో విఫలమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 10.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ (PSLV) రాకెట్.. సాంకేతిక లోపం కారణంగా గమ్యాన్ని చేరలేకపోయింది. దీంతో డీఆర్డీవో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘అన్వేష’ (EOS-N1) ఉపగ్రహంతో పాటు మొత్తం 16 ఇతర శాటిలైట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.
ప్రయోగం ఆరంభంలో మొదటి రెండు దశలు విజయవంతంగానే సాగినట్లు ఇస్రో (ISRO) తెలిపింది. అయితే మూడో దశ చివరిలో ప్రెజర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో రాకెట్ గతి తప్పింది. దీనివల్ల నాలుగో దశకు అవసరమైన థ్రస్ట్ అందలేదని, ప్రయోగం మొదలైన 8 నిమిషాలకే రాకెట్ తన నిర్దేశిత మార్గం (Flight Path) నుండి పక్కకు మళ్లిందని ఇస్రో (ISRO) చీఫ్ నారాయణన్ వెల్లడించారు. ప్రస్తుతం డేటాను విశ్లేషిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ వైఫల్యం దేశ రక్షణ రంగానికి, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లకు గట్టి దెబ్బగా మారింది. శత్రువుల కళ్లుగప్పి నిఘా వేయగల సామర్థ్యం ఉన్న ‘అన్వేష’ ఉపగ్రహాన్ని కోల్పోవడం లోటే. అలాగే హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ‘ధ్రువ స్పేస్’ భాగస్వామ్యంతో రూపొందించిన ఏడు ఉపగ్రహాలతో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్, యూకే, నేపాల్ దేశాలకు చెందిన పేలోడ్లు కూడా కక్ష్యలోకి చేరలేకపోయాయి. ఈ పరిణామం ఇస్రో (ISRO) భవిష్యత్ వాణిజ్య ప్రయోగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.






