భారత్-యూఎస్ టైగర్ ట్రయంఫ్ ప్రారంభం
భారత్, యూఎస్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కోసం రెండు దేశాల మధ్య నిర్వహించే టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది విశాఖపట్నం వేదికగా నిలిచింది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో టైగర్ ట్రయంఫ్`2024 ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వకు రెండు ఫేజ్‌లలో జరగనున్న ట్రయంఫ్ యుద్ధ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొనున్నాయి. ఈ మేరకు యూఎస్‌కు చెందిన యూఎస్ఎస్ సోమర్సెట్ యుద్ధ నౌకతో పాటు ల్యాండిరగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు యూఎస్ మైరెన్ కార్ప్స్, ఎమ్మార్కెడ్ దళాలు విశాఖకు చేరుకున్నాయి.
ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ (ఆర్ఏఎంటీ) కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్ననుంది. ఈ నెల 25వ తేదీ వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో రెండు దేశాల త్రివిధ దళాల శిక్షణ సందర్శనలు, క్రీడాపోటీలు, వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. ఆ తర్వాత 26 నుంచి 31 వ తేదీ వరకు సీ ఫేజ్ విన్యాసాలు ఉంటాయి. ఇందులో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హార్డ్), యుద్ధ విన్యాసాలను విశాఖ సముద్ర తీరానికి 40 మైళ్ల దూరంలో నిర్వహించనున్నారు.






