భారత్, యూఎస్ రక్షణ బంధం మరింత బలోపేతం
భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం కానుందని భారత్-యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. పసిఫిక్ సముద్ర జలాల్లో అన్ని దేశాలూ స్వేచ్ఛాయుత వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో భారత్, యూఎస్ త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వా యుద్దనౌక ఆన్బోర్డుపై ఇరుదేశాల ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎరిక్ మాట్లాడుతూ సాగర జలాల సరిహద్దులో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. యూఎస్ సెవెన్త్ ఫ్టీన రిజర్వ్ వైస్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోక్విన్ జె మార్టినైజ్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ నిర్వహణతో భారత్, యూఎస్ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నామన్నారు. తూర్పు నౌక దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ విన్యాసాల్లో భాగంగా హార్బర్ ఫేజ్లో విపత్తు, యుద్ధ సమయంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనే అంశాలతో పాటు ప్రీసెయిల్ చర్చలు, వృత్తిపరమైన విషయాలపై ఎక్స్పర్ట్స్ ఎక్స్ఛేంజ్లు జరగనున్నాయని తెలిపారు.






