అక్రమ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు

గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్నేళ్లుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ తాజాగా ఆదేశాలుగా జారీ చేసింది. ఏ సౌకర్యం లేని చోట ప్లాట్ కొని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్రమ లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కట్టడికి ఉపక్రమించింది. కనీసం రోడ్డు, కరెంటు లైన్, మంచి నీటి వసతి కూడా లేని అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొని సామాన్య ప్రజలు మోసపోకూడదన్న ఉద్దేశంతో. మరోవైపు ఒక వేళ ఇప్పటికే ఆ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్న వారు సైతం నష్టపోకుండా.. ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడిరచాయి. అక్రమ లే అవుట్లను నియంత్రించడంతో పాటు వాటిలో ఇళ్ల ప్లాట్లను కొనుగోలు చేసే వారు మోసపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తగిన సూచనలు చేయాలంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,169 అక్రమ లే అవుట్లలో కేవలం 4,179 లే అవుట్లకు మాత్రమే రోడ్డు వసతి ఉంది. కేవలం 362 లేఅవుట్లకు మాత్రం మంచి నీటి సరఫరా సౌకర్యం అందుబాటులో ఉంది. 814 లే అవుట్లకు కరెంటు లైను వసతి ఉన్నట్టు అధికారులు తేల్చారు. అంటే 9,355 అక్రమ లే అవుట్లకు కరెంటు లైను కూడా లేదు. నిబంధనల ప్రకారం.. అనుమతులు పొందిన లే అవుట్లకు మాత్రమే కొత్తగా రోడ్డు వసతితోపాటు కరెంటు లైను, మంచి నీటి పైపులైను ఏర్పాటుకు ప్రభుత్వం, అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీలు, గ్రామ పంచాయతీలు ముందుకొస్తాయి. అనుమతులు పొందని వాటికి ఆ వసతుల కల్పనకు ఆటంకాలు ఉంటాయి. ఇళ్ల కోసం కొత్తగా ఎలాంటి లే అవుటు ఏర్పాటు చేయాలన్నా, ముందుగా సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి పొందడంతో పాటు లే అవుటు ప్లానింగ్‌కు సంబంధించి డీటీసీపీ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
వ్యవసాయ భూమిలో లే అవుటు ఏర్పాటు చేస్తుంటే దానికీ వేరుగా అనుమతులు తీసుకోవాలి. ఈ సమయంలో లే అవుట్ల విస్తీర్ణం ప్రకారం నిబంధనల మేరకు వెడల్పైన అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. మొత్తం లే అవుట్ల విస్తీర్ణంలో పది శాతం భూమిని సంబంధిత గ్రామ పంచాయతీకి బదలాయించాల్సి ఉంటుంది. ఆ ప్రాంత స్థానికుల అవసరాల మేరకు భవిష్యత్‌లో అక్కడ పాఠశాల, పార్కు, మంచి నీటి ట్యాంకు వంటి వాటి ఏర్పాటుకు వీలుంటుంది. నగరాలు, పెద్ద పట్టణాలను ఆనుకొని ఉండే గ్రామాల్లోనే అక్రమ లే అవుట్ల దందా పెద్ద ఎత్తున సాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,684 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు విస్తరించి ఉండగా, అందులో నగరాలు, పెద్ద పట్టణాలు ఆనుకొని ఉన్న గ్రామాల్లోనే 29,075 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నాయని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడిరచారు. మిగిలిన గ్రామాల్లో కేవలం 8,609 ఎకరాల్లో ఈ అక్రమ లే అవుట్లు ఉన్నాయి.