తిరుమలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు : టీటీడీ

తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతమే శ్రీ హనుమంతుని జన్మ స్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పంచాంగంలో నిర్దేశించిన ప్రకారం ఏటా చేసే కార్యక్రమాలు యథాతథంగా ఉంటాయని చెప్పారు. ఆకాశగంగలో నిత్యం ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు అంజనాదేవి, బాలహనుమంతులకు అభిషేకం, పుష్పార్చన కొనసాగించడంతో పాటు ఈ మార్గాన్ని బాగుచేస్తామని చెప్పారు. తిరుమలకు వచ్చే యాత్రికులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతిస్తామన్నారు.
హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ అని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ స్వామి గోవిందానంద సరస్వతీ భిన్నమైన ప్రకటనలు చేయడాన్ని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఖండించారు. శాస్త్రాధారాలతో ఆంజనేయస్వామి తిరుమలలో జన్మించినట్లు ప్రకటించామని ధర్మారెడ్డి తెలిపారు.