TDP: అనర్హత వేటు నుంచి బైపోల్స్ వరకు..ఏపీ అసెంబ్లీ చుట్టూ పెరుగుతున్న చర్చ..
ఏపీలో (Andhra Pradesh) ఉప ఎన్నికలు జరుగుతాయా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. టీడీపీ (TDP) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త వేడెక్కాయి. వైసీపీ (YSR Congress Party)కు అసెంబ్లీలో కేవలం 11 సీట్లు వచ్చినా, తమకు దాదాపు 40 శాతం ఓటు షేర్ ఉందని ఆ పార్టీ వాదిస్తోంది. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే నిబంధనల ప్రకారం కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని అధికార పక్షం స్పష్టం చేస్తోంది.
ఈ వివాదం కారణంగా గత ఏడాదిన్నరగా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల సభలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోయినా, హాజరు రిజిస్టర్లో సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై గతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) సభలోనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా కేవలం సంతకాలు చేసి వెళ్లడం సరికాదని, పని చేయని ఉద్యోగులకు జీతాలు ఇస్తారా అంటూ ప్రశ్నించారు.
ఈ పరిణామాలపై కూటమి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎన్నిసార్లు కోరినా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావడం లేదని, ఇదే కొనసాగితే అనర్హత వేటు తప్పదన్న హెచ్చరికలు కూడా వచ్చాయి. అయితే అప్పట్లో వైసీపీ నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇప్పుడు మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే ఎమ్మెల్యేల నైతికత. సభకు రాకుండా సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకోవడం నైతికంగా తప్పు అన్న అభిప్రాయంతో ఏపీ ఎథిక్స్ కమిటీ (AP Ethics Committee) రంగంలోకి దిగుతుందన్న ప్రచారం జరుగుతోంది.
సభకు హాజరు కాకుండా ఇలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు ఆరుగురు వరకు ఉంటారని సమాచారం. వారికి నోటీసులు జారీ చేసి కమిటీ ఎదుట హాజరుకావాలని కోరే అవకాశముందని చెబుతున్నారు. విచారణ అనంతరం స్పీకర్‌కు నివేదిక ఇచ్చి, చర్యలు సూచిస్తారని సమాచారం. స్పీకర్ చర్యలు తీసుకుంటే అప్పీల్‌కు అవకాశం ఉండదన్న వాదన కూడా వినిపిస్తోంది. అలా సభ్యత్వాలు రద్దయితే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవన్న మాట.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇది జరిగితే ఏపీలో స్థానిక ఎన్నికలకు ముందే మినీ ఎన్నికల సమరం మొదలయ్యే అవకాశం ఉంది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అంటే రాజకీయంగా చిన్న విషయం కాదని విశ్లేషకులు అంటున్నారు. గతంలో తెలంగాణలో (Telangana) జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక ఒక్కటే పెద్ద హీట్ తెచ్చిందని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఏపీలో ఇప్పటికే ఉప్పు-నిప్పులాంటి రాజకీయ వాతావరణంలో ఆరు బైపోల్స్ వస్తే తీవ్ర స్థాయిలో రాజకీయ వేడి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై కూడా చర్చ సాగుతోంది. గతంలోనూ సభకు రాకుండా సంతకాలు చేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటివి జరిగాయని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల విషయంలోనే ఎందుకు అభ్యంతరం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యే సమయంలో ఉప ఎన్నికలు వస్తే, ఆరుకు ఆరు గెలవాల్సిన ఒత్తిడి ఉంటుంది. ఒక్కటి ఓడినా ప్రజా వ్యతిరేకత అంటూ వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అందుకే అనర్హత వేటుపై నిర్ణయం తీసుకునే ముందు రాజకీయ లెక్కలు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.






