దుబాయ్ ఎక్స్పో లో మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు : మంత్రి గౌతమ్ రెడ్డి
దుబాయ్ ఎక్స్పో-2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కీలక అవగాహన ఒప్పందాలను (ఎంవోయూ) కుదుర్చుకుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. రీజెన్సీ గ్రూప్ రూ.150 కోట్ల పెట్టుబడులతో 25 రిటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. అనంతపురం, కడప, కర్నూలు, మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు, హిందపూరం ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలు, సుగంధ ద్రవ్యాల ప్యాకింగ్ యూనిట్లను సంస్థ ఏర్పాటు చేస్తుంది. కృత్రిమ మేథకు సంబంధించి ట్రోయో జనరల్ ట్రేడిరగ్ సంస్థతో ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ విశాఖలో 300 హైఎండ్ ఐటీ ఉద్యోగాలు కల్పించే దిశగా ఒప్పందం కుదురుకుంది.
లండన్‌కు చెందిన కాజస్ ఈ`మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టేలా ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రజా రవాణాకు సంబంధించిన డిజీల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్పు చేసే పరిశ్రమను కడప మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఈ సంస్థ ఏర్పాటు చేయనుందని మంత్రి తెలిపారు.






