Dubai: పెట్టుబడులకు స్వర్గధామం… ఆంధ్రప్రదేశ్ దుబాయ్ రోడ్‌షోలో చంద్రబాబు
మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) దుబాయ్ చేరుకున్నప్పుడు ఆయనకు భారత రాయబార కార్యాలయ అధికారులు, ఎన్నారైలు, తెలుగువాళ్ళు పలువురు ఘనంగా స్వాగతం పలికారు. తొలి రోజు ఆయన చేపట్టిన పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ఈ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల చైర్మన్లు, భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో సీఎంచంద్రబాబు బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఐఐ నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని, ఏపీలోని అపార అవకాశాలను యూఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు విశేష స్పందన లభించింది. పారిశ్రామికవేత్తలు నిలబడి చప్పట్లతో (స్టాండిరగ్ ఓవేషన్) తమ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే తరహాలో విశాఖపట్నం అభివృద్ధిలో గూగుల్ ప్రధాన పాత్ర పోషించనుంది. గూగుల్ సంస్థ విశాఖలో భారీ ఏఐ డేటా హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. దీంతో విశాఖ భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా మారనుంది’’ అని తెలిపారు.
వ్యవసాయం నుంచి టెక్నాలజీ వరకు, గనుల నుంచి అంతరిక్ష సాంకేతికత వరకు, చిప్ తయారీ నుంచి నౌకా నిర్మాణం వరకు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపులంగా వివరించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రమైనప్పటికీ, అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. రాయలసీమలో ఉద్యానవన పంటలకు, తీరప్రాంతంలో ఆక్వా కల్చర్‌కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా పోర్టులు, విమానాశ్రయాలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని, రాష్ట్రంలో తిరుపతి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత వల్లే పెట్టుబడులు వస్తున్నాయని, అమరావతిలో లైబ్రరీ నిర్మాణం కోసం శోభా గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ఇవ్వడమే దీనికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు.
వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు దుబాయ్ పారిశ్రామికవేత్త లను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. ‘‘మీరు సరైన పారిశ్రామిక ప్రతిపాదనలతో వస్తే, అవగాహన ఒప్పందాలతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే ఆమోదం తెలుపుతాం. ముందుగా ఏపీకి రండి, ఇక్కడి ప్రభుత్వ విధానాలను, అవకాశాలను పరిశీలించండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి’’ అని వారికి భరోసా ఇచ్చారు.
గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టండి
దుబాయ్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని, ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రెండో రోజు పర్యటనలో ఆయన యూఏఈకి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో పెట్టుబడి పెట్టాలని ప్రముఖ సంస్థ అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ చైర్మన్ ఖలీఫా కౌరీని కోరారు. బ్యాటరీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులపైనా చర్చించారు. హైకెపాసిటీ బ్యాటరీ స్టోరేజీ ద్వారా గ్రిడ్ డిమాండ్‌ను నిర్వహించేందుకు ఆస్కారం ఉందని అపెక్స్ ప్రతినిధులు ఆయనకు తెలిపారు. సూపర్ కెపాసిటర్స్ తయారీలోనూ అపెక్స్‌కు మంచి పేరుండడంతో ఏపీలో అందులోనూ పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.
చంద్రబాబు ఆహ్వానాన్ని తప్పక పరిశీలిస్తామని, పెట్టుబడులు పెడతామని అపెక్స్ హామీ ఇచ్చింది. అపెక్స్ సూపర్ కెపాసిటర్ ఉత్పత్తులను రాష్ట్రానికి పంపాలని సీఎం కోరగా.. తప్పనిసరిగా పంపుతామని, సముద్రమార్గంలో వాటిని పంపుతామని చైర్మన్ ఖలీఫా తెలిపారు. ఆతిథ్య రంగంలోనూ ఈ సంస్థ ఉండడంతో అందులోనూ పెట్టుబడులకు చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం పునరుత్పాదక ఇంధన రంగంలో పేరొందిన మస్దార్ సంస్థ సీఈవో మొహమ్మద్ జమీల్ అల్ రమాహీతో ఆయన భేటీ అయ్యారు. ఏపీ-మస్దార్ మధ్య భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. సౌర, పవన, గ్రీన్హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దిగ్గజ సంస్థ అగ్తియా గ్రూప్ సీఈవో సల్మీన్ అల్మేరీతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. హార్టీకల్చర్, ఆక్వా కల్చర్‌లో ఏపీలో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని.. రాష్ట్రంలో కోకో ఉత్పత్తి జరుగుతోందని.. చాక్లెట్ పరిశ్రమ ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అవసరమైన అపారమైన వనరులు ఏపీలో ఉన్నాయని, ఒకసారి పర్యటించాలని సీఎం విజ్ఞప్తి చేయగా.. అగ్తియా సీఈవో సానుకూలంగా స్పందించారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో జరిగిన సమావేశంలో.. ఏపీలో మాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెడుతున్న పెట్టుబడులపై చర్చించారు. యూఏఈకి చెందిన సంస్థలతో ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు సహకరించాలని యూసఫ్ అలీని సీఎం కోరారు.
పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం: చంద్రబాబు భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన యుఎఇ పర్యటనలో భాగంగా అబూధాబీలోని అల్ మైరాప్ా ఐలాండ్‌లోని ఏడీజీఏ స్క్వేర్‌లో అబూధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి అహ్మద్ బిన్ తలిత్‌తో ఆయన సమావేశమయ్యారు. దక్షిణాసియాలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీ.. ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమని చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో పెట్రో కెమికల్, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు అనువుగా ఉన్నట్లు తెలిపారు. సదరు కంపెనీ-ఏపీ మధ్య సాంకేతిక సహకారంపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. అనంతరం అబూధాబీ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీతో, జీ42 సీఈవో మన్సూర్ అల్ మన్సూరీతోనూ సీఎం సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని వారికి తెలిపారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్న జీ 42 సంస్థను.. ఏఐ డేటాసెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు. స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీని రాష్ట్రంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
యుఎఇ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలతో చంద్రబాబు బిజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబీలో పలు వ్యాపార, పారిశ్రామిక సమావేశాలలో పాల్గొన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, జీ-42 సీఈఓ మాన్సూర్ అల్ మాన్సూరీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, సాంకేతిక సహకారం, పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ: ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ దశను దాటి ‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ దిశగా వేగంగా సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, సాంకేతిక వినియోగం కారణంగా పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని చెప్పారు.
అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు: సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని తెలిపారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడిరచారు. ఇది దేశంలో సాంకేతిక విప్లవానికి దారితీసే అడుగు అవుతుందని చెప్పారు. ‘‘అమరావతి భవిష్యత్తు సాంకేతికత, ఇన్నోవేషన్, పెట్టుబడులకు హబ్‌గా మారుతుంది. ఇక్కడి నుంచి ఆవిష్కరణలు ప్రపంచానికి చేరుతాయి’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం: నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (భాగస్వామ్య సదస్సు) కు రావాలని ఆయన అబుదాబీ ప్రతినిధులను ఆహ్వానించారు. పెట్టుబడుల దిశగా ఏపీ తీసుకుంటున్న వేగవంతమైన చర్యలను ప్రత్యక్షంగా చూడాలని సూచించారు. అబుదాబీ ప్రతినిధులు స్పందిస్తూ, త్వరలో ఏపీ పర్యటనకు వస్తామని, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.
ఏడీఎన్వోసీతో ఇంధన రంగ చర్చలు: తర్వాత సీఎం చంద్రబాబు అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆసక్తి ఏడీఎన్‌వోసీ ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కి దక్షిణాసియాకు సమీపంగా సుదీర్ఘ తీరప్రాంతం ఉండటం వల్ల ఇంధన, పెట్రో కెమికల్ రంగాలకు విశేష అవకాశాలు ఉన్నాయని వివరించారు. ‘‘ఏపీ భౌగోళికంగా వ్యూహాత్మకంగా ఉన్న రాష్ట్రం. పెట్రో కెమికల్ పరిశ్రమలు, గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులకు ఇది సరైన వేదిక.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు. అబుదాబీ పారిశ్రామికవేత్తలతో విందు భేటీ: రోజంతా జరిగిన అధికారిక సమావేశాల అనంతరం సీఎం బృందం అబుదాబీలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో విందు భేటీలో పాల్గొన్నారు. ఈ నెట్వర్క్ లంచ్‌లో పలు రంగాల ప్రముఖ సంస్థల సీఈవోలు పాల్గొన్నారు. వీరిలో జీ-42 సీఈవో మనుకుమార్ జైన్, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యుఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్, పాలిగాన్ మార్ఫిక్ సీఈవో జయంతి కనాని, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ సీఈవో యశిష్ దహియా, ఇన్స్యూరెన్స్ మార్కెట్ సీఈవో అవినాష్, ఇన్సార్ట్స్ సీఈవో అజార్ ఇక్బాల్, జీఐఐ సీఈవో పంకజ్ గుప్తా, నూన్ సీఈవో ఫరాజ్ ఖలీద్, ఇన్సెప్షన్ సీఈవో ఆషీష్ కోషి తదితరులు పాల్గొన్నారు. సీఎం ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడి వాతావరణం, పరిశ్రమల విధానాలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరుల లభ్యత, రవాణా సౌకర్యాల గురించి వారికి వివరించారు. ఇందులో రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.






