Kolikapudi: చంద్రబాబు సీరియస్.. కొలికపూడిపై ఈసారి వేటు తప్పదా..?
తెలుగుదేశం పార్టీలో ఇద్దరు నేతల మధ్య చెలరేగిన అంతర్గత వివాదం ఇప్పుడు చినికిచినికి గాలివానగా మారుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas) మధ్య నడుస్తున్న బహిరంగ మాటల యుద్ధంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాళ్లను పిలిపించి మాట్లాడొద్దని, తాను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత తానే మాట్లాడతానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు (Palla Srinivasa Rao) చెప్పినట్లు సమాచారం. మరోవైపు అధినేత సీరియస్ గకావడంతో వివరణ ఇచ్చేందుకు కొలికపూడి శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్ అపాయింట్‌మెంట్ కోరడం చర్చనీయాంశంగా మారింది.
ఎంపీ కేశినేని చిన్నిని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో చేసిన తీవ్ర విమర్శలు పార్టీలో, రాష్ట్రంలో కలకలం రేపాయి. వ్యక్తిగత అంశాలు, పార్టీ పరమైన అంశాలు రెండింటిపైనా ఈ ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ ఘర్షణ కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో లుకలుకలు బహిర్గతమై, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే స్థాయికి చేరుకున్నాయి.
పార్టీ నేతల మధ్య బహిరంగ పోరుపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. “వివాదంలో ఉన్న ఈ ఇద్దరు నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వారెవరినీ పార్టీ కార్యాలయానికి పిలవవద్దు.” అని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదనే సంకేతాన్ని ఇవ్వడంతో పాటు, పార్టీ కార్యాలయాన్ని అంతర్గత పంచాయితీలకు వేదికగా మార్చవద్దనే ఉద్దేశంతోనే ఆయన ఈ ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు ఇంత సీరియస్‌గా స్పందించి, ఎవరినీ పార్టీ కార్యాలయానికి పిలవవద్దని, మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అపాయింట్‌మెంట్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన వాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే కొలికపూడి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. తాను ఎంపీ కేశినేని చిన్నిపై సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో పల్లాకు వివరణ ఇచ్చేందుకు కొలికపూడి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎంపీతో తనకున్న విభేదాలకు గల కారణాలను, తన వైపు న్యాయాన్ని అధిష్టానానికి తెలియజేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీకి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఆదేశాల తర్వాత కొలికపూడికి పల్లా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవచ్చు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతే వీళ్లిద్దరినీ ఉండవల్లికి పిలిపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు కొలికపూడి శ్రీనివాస రావు పార్టీ లైన్ దాటారు. ఆయనపై నియోజకవర్గంలో కేడర్ మొత్తం కంప్లెయింట్ చేసింది. చివరకు మీడియా ప్రతినిధులు కూడా కొలికపూడి తీరుపై నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏకంగా బహిరంగ వేదికలపై పార్టీ ఎంపీపైన ఆరోపణలు చేయడాన్ని అధిష్టానం చాలా సీరియస్ గా పరిగణనిస్తోంది. అందుకే ఈసారి కొలికపూడిపై వేటు తప్పదనే సంకేతాలు పార్టీలో వినిపిస్తున్నాయి.







