Dubai: మీ సేవలు జన్మభూమికి అవసరం… దుబాయ్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు
‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నతస్థాయిలో ఉండాలని, గ్లోబల్ లీడర్లుగా మారాలని భావించాను. నేడు దుబాయ్‌లో ఏ కార్యాలయానికి వెళ్లినా తెలుగువారు ఉన్నతస్థానాల్లో కనిపించడం, గ్లోబల్ లీడర్ల స్థాయికి చేరడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు.
యూఏఈ పర్యటనలో భాగంగా చివరి రోజు దుబాయ్‌లోని లీమెరిడియన్ హోటల్‌లో జరిగిన ప్రవాస తెలుగు ప్రజల సభలో సీఎం ప్రసంగించారు. ఈ సమావేశానికి ఒమన్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ, కువైట్‌తో పాటు 10 దేశాల నుంచి ప్రవాసాంధ్రులు వేలసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అక్కడ తెలుగువారు ఉండాలన్నది తన కోరికగా పేర్కొన్నారు. తెలుగువారిని గ్లోబల్ సిటిజన్స్‌గా చూడాలనుకున్నానని, కానీ వారు నేడు గ్లోబల్ లీడర్స్‌గా ఎదుగుతుండడం గర్వంగా ఉందన్నారు. 2047 నాటికి హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ స్వర్ణాంధ్రప్రదేశ్ తన లక్ష్యమని.. దానికి అందరూ సహకరించాలని కోరారు. జన్మభూమిని.. కర్మభూమిని ఎప్పుడూ మీరు మరవద్దు. యూఏఈలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే మంచి అభిప్రాయం కనిపించింది. ఇప్పుడు మీరు జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది.
1995లో నేను సీఎం అయినప్పుడు తెలుగువారందరికీ ఒకే మాట చెప్పేవాడిని.. మీ పిల్లలకు ఆస్తులివ్వడం కన్నా మంచి చదువు చెప్పించండని చెప్పేవాడిని. ప్రపంచాన్ని జయించగల సత్తా తెలుగువారిది. మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తే.. అందులో ఉద్యోగిగా చేరిన సత్య నాదెళ్ల ఇప్పుడు అదే సంస్థకు సీఈవోగా ఉన్నారు’ ఆయన ఏడాది జీతం రూ.850 కోట్లు. తెలుగుజాతికి తిరుగులేదన్నది నా ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలో నంబర్ వన్‌గా జాతిగా.. అత్యంత ప్రభావవంతమైన జాతిగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. 2024 ఎన్నికల్లో మీరంతా వచ్చి కూటమి విజయానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ పనిచేశారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర పునర్నిర్మాణానికి నేను, పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని చంద్రబాబు వివరించారు. ‘‘గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తీసుకొచ్చాను. ఇప్పుడు అదే స్ఫూర్తితో విశాఖపట్నానికి గూగుల్ తీసుకువస్తున్నాం. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది’’ అని ప్రకటించారు. దేశంలోనే ‘క్వాంటం వ్యాలీ’ ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పారు. ‘‘ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. ఐటీ, కమ్యూనికేషన్ల రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నాం’’ అని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వచ్చే జనవరి నుంచి పనిచేయనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. రాబోయే 10 ఏళ్లలో వినూత్న మార్పులు రాబోతున్నాయి. దేశంలోని ప్రతి పౌరుడి డేటాతో డేటాలేక్ రూపొందిస్తున్నామన్నారు.
అబుధాబి, దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి నాలెడ్జ్ ఎకానమీ దిశగా వెళ్తున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధారంగా 1.50 లక్షల గదులను అందుబాటులోకి తెచ్చింది. షాపింగ్ మాల్స్ వచ్చాయి. వర్షాలు లేని ప్రాంతాన్నే ఇలా తీర్చిదిద్దితే.. అన్ని వనరులూ ఉన్న ఏపీ ఏ స్థాయిలో ఉండాలి’ అని పేర్కొన్నారు. ‘ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయాలన్నదే లక్ష్యం. ఏదీ అసాధ్యం కాదు. పాతికేళ్ల ముందు నేను సెల్‌ఫోన్ గురించి మాట్లాడితే అంతా ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్‌ఫోన్ లేకుండా ఏ ఒక్కరూ క్షణం ఉండే పరిస్థితి లేదు. పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 700కు పైగా సేవలు అందుబాటులోకి తెచ్చాం’ అన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించేందుకు తిరుపతి దగ్గర స్పేస్‌సిటీ ఏర్పాటు చేస్తున్నాం. సింగపూర్, దుబాయ్‌లు త్వరలో ఎయిర్ టాక్సీలు ప్రవేశ పెట్టబోతున్నాయి. వాటిని సరఫరా చేసేస్థాయికి ఏపీ త్వరలోనే చేరుతుంది’ అని తెలిపారు. ఇక్కడ ఉన్నవారిలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే.. అందులో ఒకరు పరిశ్రమ పెట్టే దిశగా ఆలోచన చేయండి. సొంత ప్రాంతానికి వచ్చే కంపెనీ పెట్టక్కర్లేదు. సాంకేతికత ఆధారంగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కంపెనీ ఏర్పాటుచేయడం సులువు. వర్చువల్‌గా పనిచేయవచ్చు. ఏ దేశంలో ఉన్నా.. మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా’ అని పేర్కొన్నారు.
‘అబుధాబిలోని స్వామి నారాయణ్ మందిర్ బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించింది. నేను చాలా ఆలయాలు చూశా. ఇక్కడి పాలకులు కూడా మెచ్చుకునేలా అద్భుతంగా మందిరాన్ని నిర్మించారు. అందరి సహకారంతో మన సంప్రదాయాలు కొనసాగించే విధానం మనది’ అని తెలిపారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం వారితో ఫొటోలు దిగారు. ఈ సమావేశంతో సీఎం యూఏఈ పర్యటన ముగిసింది. మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఏపీఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు.







