UAE: యుఎఇ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలతో చంద్రబాబు బిజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబీలో పలు వ్యాపార, పారిశ్రామిక సమావేశాలలో పాల్గొన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, జీ-42 సీఈఓ మాన్సూర్ అల్ మాన్సూరీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, సాంకేతిక సహకారం, పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిపారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ: ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ దశను దాటి ‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ దిశగా వేగంగా సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, సాంకేతిక వినియోగం కారణంగా పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని చెప్పారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు: సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని తెలిపారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడిరచారు. ఇది దేశంలో సాంకేతిక విప్లవానికి దారితీసే అడుగు అవుతుందని చెప్పారు. ‘‘అమరావతి భవిష్యత్తు సాంకేతికత, ఇన్నోవేషన్, పెట్టుబడులకు హబ్‌గా మారుతుంది. ఇక్కడి నుంచి ఆవిష్కరణలు ప్రపంచానికి చేరుతాయి’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం: నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (భాగస్వామ్య సదస్సు) కు రావాలని ఆయన అబుదాబీ ప్రతినిధులను ఆహ్వానించారు. పెట్టుబడుల దిశగా ఏపీ తీసుకుంటున్న వేగవంతమైన చర్యలను ప్రత్యక్షంగా చూడాలని సూచించారు. అబుదాబీ ప్రతినిధులు స్పందిస్తూ, త్వరలో ఏపీ పర్యటనకు వస్తామని, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.
ఏడీఎన్‌వోసీతో ఇంధన రంగ చర్చలు: తర్వాత సీఎం చంద్రబాబు అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆసక్తి ఏడీఎన్‌వోసీ ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కి దక్షిణాసియాకు సమీపంగా సుదీర్ఘ తీరప్రాంతం ఉండటం వల్ల ఇంధన, పెట్రో కెమికల్ రంగాలకు విశేష అవకాశాలు ఉన్నాయని వివరించారు. ‘‘ఏపీ భౌగోళికంగా వ్యూహాత్మకంగా ఉన్న రాష్ట్రం. పెట్రో కెమికల్ పరిశ్రమలు, గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులకు ఇది సరైన వేదిక.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు. అబుదాబీ పారిశ్రామికవేత్తలతో విందు భేటీ: రోజంతా జరిగిన అధికారిక సమావేశాల అనంతరం సీఎం బృందం అబుదాబీలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో విందు భేటీలో పాల్గొన్నారు.
ఈ నెట్‌వర్క్ లంచ్‌లో పలు రంగాల ప్రముఖ సంస్థల సీఈవోలు పాల్గొన్నారు. వీరిలో జీ-42 సీఈవో మనుకుమార్ జైన్, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్‌సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యుఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్, పాలిగాన్ మార్ఫిక్ సీఈవో జయంతి కనాని, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ సీఈవో యశిష్ దహియా, ఇన్స్యూరెన్స్ మార్కెట్ సీఈవో అవినాష్, ఇన్సార్ట్స్ సీఈవో అజార్ ఇక్బాల్, జీఐఐ సీఈవో పంకజ్ గుప్తా, నూన్ సీఈవో ఫరాజ్ ఖలీద్, ఇన్సెప్షన్ సీఈవో ఆషీష్ కోషి తదితరులు పాల్గొన్నారు. సీఎం ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడి వాతావరణం, పరిశ్రమల విధానాలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరుల లభ్యత, రవాణా సౌకర్యాల గురించి వారికి వివరించారు. ఇందులో రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.







