IAS: ఐఏఎస్‌లపై రేవంత్, చంద్రబాబు విభిన్న పంథా..! ఎవరు కరెక్ట్..!?

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఐఏఎస్ (IAS Officers) ల పనితీరుపై అనేక విమర్శలు ఉన్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ మొత్తం ఐఏఎస్ లపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు సివిల్ సర్వెంట్లలో (civil servents) 90శాతం మంది పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. దీంతో పాలన సక్రమంగా సాగట్లేదు. అవినీతి, అక్రమాల్లో పాలకులకు తోడుగా ఉంటున్నారు. దీంతో కోర్టులు, జైళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారు. అయితే సివిల్ సర్వెంట్లను డీల్ చేయడంలో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రులిద్దరూ విభిన్న పంథా అనుసరిస్తున్నారు. ఎవరి వర్షన్ కరెక్ట్ అనేదానిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాధ్యతలు చేపట్టి ఏడాది దాటిపోయింది. ఈ మధ్యకాలంలో ఆయన ఐఏఎస్ అధికారుల పనితీరుపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను చెప్తూ వచ్చారు. తాజాగా ఐఏఎస్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఏసీ గదులు దాటి బయటకు రావట్లేదని.. రూములకు అతుక్కుపోతున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాసమస్యలను చూడాలని సూచించారు. సీఎం అయిన కొత్తలో కూడా ఐఏఎస్ లపై ఇదే తరహాలో మాట్లాడారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు కోవర్టుల్లా తయారయ్యారని.. లీకులిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని విమర్శించారు. అలాంటి వాళ్లను ఉపేక్షించే అవకాశం లేదని హెచ్చరించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu) ఐఏఎస్ లను డీల్ చేసి విధానం రేవంత్ రెడ్డి తీరుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన ఐఏఎస్ అధికారులపై ఒక్క మాట కూడా పడనీయరు. ఆయన పొరపాటున కూడా ఒక్క మాట అనరు. పైగా ఐఏఎస్ అధికారులపై ఏవరైనా నేతలు నోరుజారిపై వాళ్లనే పిలిచి హెచ్చరిస్తుంటారు. అవసరమైతే సారీ కూడా చెప్పిస్తుంటారు. తాజాగా జీవీ రెడ్డి (GV Reddy) ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ లను తన ఇష్టానుసారం వాడుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం వాళ్ల మాట కాదని ఏ పనీ చేయరు.
ఏపీలో ఐఏఎస్ లపై ఎవరైనా నోరు జారితే వెంటనే ఐఏఎస్ అధికారుల సంఘం సీఎం చంద్రబాబుకు కంప్లెయింట్ చేస్తుంది. తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఐఏఎస్ లను హెచ్చరిస్తుంటారు. అయినా ఐఏఎస్ అధికారుల సంఘం పొరపాటున కూడా నోరు తెరిచే పరిస్థితి ఉండదు. రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారులతో పని చేయించడంలో సక్సెస్ అవుతున్నారని.. చంద్రబాబు మాత్రం అతి మంచితనం వల్ల ఐఏఎస్ లను నెత్తికెక్కించుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేతలు, కార్యకర్తలకు విలువ ఇవ్వకుండా ఐఏఎస్ లను మాత్రమే నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో గతంలో ఎన్నో సందర్భాల్లో తెలిసొచ్చినా చంద్రబాబు మారట్లేదని విమర్శిస్తున్నారు.