AP–TS: తెలంగాణకు BYD, ఏపీకి Tesla.. తగ్గేదేలే..!?

2014లో ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (Telangana) రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అన్ని రంగాల్లోనూ తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. విద్య, వైద్యం, రవాణా, రాజకీయాలతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ఈ రెండు రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామి సంస్థలైన BYD, Tesla తమ ఫ్యాక్టరీలను తెలుగు రాష్ట్రాల్లో స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది రెండు రాష్ట్రాలకు ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎంతో గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు.
తెలంగాణ ఇటీవల చైనాకు (China) చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం BYD (Build Your Dreams)ని ఆకర్షించడంలో సఫలమైంది. హైదరాబాద్ (Hyderabad)లో తన తొలి భారతీయ ఫ్యాక్టరీని స్థాపించేందుకు BYD సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం మూడు స్థలాలను సూచించింది. అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. హైదరాబాద్ లో 20 గిగావాట్ బ్యాటరీ ప్లాంట్‌తో పాటు ఏటా 6 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఫ్యాక్టరీ పెట్టాలని BYD నిర్ణయించినట్లు సమాచారం. సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఇక్కడ పెట్టనుంది. 2032 నాటికి పూర్తి స్థాయిలో ఇది ఉత్పత్తిని ప్రారంభిస్తుందని అంచనా. ఇప్పటికే 107 బిలియన్ డాలర్ల ఆదాయంతో Teslaని అధిగమించింది BYD. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా నిలిచింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో అమెరికాకు (America) చెందిన Tesla తన ఫ్యాక్టరీని స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గతంలోనే Tesla సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. విశాఖపట్నం లేదా శ్రీ సిటీలో Tesla ఫ్యాక్టరీ రావచ్చని అంచనాలు ఉన్నాయి. Tesla ఇప్పటికే భారతదేశంలో తన మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి తోడు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు Teslaని ఆకర్షిస్తున్నాయి. Tesla 2024లో 97.7 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించినప్పటికీ, BYD చౌక ధరల్లో అధునాతన సాంకేతికతతో ఉత్పత్తులను అందిస్తూ అగ్రగామిగా నిలుస్తోంది..
ఈ రెండు సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్స్ స్థాపిస్తే, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. తెలంగాణలో BYD ఫ్యాక్టరీ వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. అదే విధంగా ఏపీలో Tesla వస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. అంతేకాక ఈ రెండు రాష్ట్రాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి (EV) కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. BYD వెయ్యి కిలోవాట్ ఫ్లాష్ ఛార్జర్‌తో 5-8 నిమిషాల్లో కారు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసే సాంకేతికతను ఇప్పటికే పరిచయం చేసింది. అదే సమయంలో Tesla తన సూపర్‌ఛార్జర్ నెట్‌వర్క్ తో పోటీ పడుతోంది.
ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య పోటీని మరింత ఉధృతం చేస్తాయి. తెలంగాణ హైదరాబాద్‌ను టెక్ హబ్‌గా మార్చుకుంటూ BYD లాంటి సంస్థలను ఆకర్షిస్తుంటే, ఏపీ విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తూ Teslaని రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతమైతే, తెలుగు రాష్ట్రాలు ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో (Electrice Vehicles Market) కీలక పాత్ర పోషిస్తాయి.