Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వెల్లువ..
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి చేరినట్టుగా అధికారికంగా ప్రకటించబడింది. ప్రపంచ ప్రఖ్యాత బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ (Brookfield Asset Management) సంస్థ రాష్ట్రంలో సుమారు ₹1.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విశేషాన్ని ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్వయంగా వెల్లడించారు. ఇటీవలే ఆయన రిన్యూ పవర్ (Renew Power) తిరిగి ఏపీకి వస్తోందని చెప్పిన నేపథ్యంలో, మరో అంతర్జాతీయ కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ఆసక్తి చూపడం రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ పెట్టుబడులు ప్రధానంగా పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టులు, బ్యాటరీ నిల్వ కేంద్రాలు, పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు, అలాగే సౌర తయారీ రంగంలో వినియోగించబడనున్నాయి లోకేష్ పేర్కొన్నారు. అదనంగా, కార్బన్ ఉత్సర్గలను తగ్గించే పలు కార్యక్రమాల్లో కూడా బ్రూక్‌ఫీల్డ్ భాగస్వామ్యం చేస్తుందని ఆయన వివరించారు. అంతేకాకుండా డేటా సెంటర్లు, రియల్ ఎస్టేట్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, మౌలిక వసతులు, పోర్టులు వంటి విభాగాల్లో కూడా ఈ సంస్థ తమ కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉందని వెల్లడించారు.
ఈ పెట్టుబడులు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో విపరీతమైన అవకాశాలను తెరుస్తాయని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను బలమైన పెట్టుబడుల కేంద్రంగా మార్చడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని ఆయన భావిస్తున్నారు. మరోవైపు, విశాఖపట్నంలో (Visakhapatnam) కూడా భారీ పెట్టుబడి ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tillman Global Holdings) కంపెనీ రూ.15 వేల కోట్లతో 300 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌తో ఉద్యోగావకాశాలు పెరగడంతో పాటు, టెక్నాలజీ రంగంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు లభించనుంది.
ఐదేళ్ల గత ప్రభుత్వ కాలంలో ఎస్ఐపిబి సమావేశాలు చాలా తక్కువగా జరగడంతో పెట్టుబడులు తగ్గిపోయాయి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నేతృత్వంలో ఏడాది వ్యవధిలోనే 12 ఎస్ఐపిబి మీటింగ్స్ నిర్వహించబడటం, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది. దాదాపు ప్రతి నెలా ఒకసారి సమావేశం నిర్వహించడం ద్వారా రాష్ట్రం “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ముందంజలో ఉందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, అనుమతులు వేగంగా అమలు కావడం ప్రస్తుతం భారీ పెట్టుబడులు వరుసగా రావడానికి కారణంగా మారింది.
ఏపీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో ఈ తాజా పెట్టుబడులు కీలకమైన మలుపు కానున్నాయని నిపుణులు భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, పారిశ్రామిక వృద్ధి, అంతర్జాతీయ కంపెనీల విశ్వాసం..అన్ని ఆంధ్రప్రదేశ్‌కు బలమైన భవిష్యత్తును సూచిస్తున్నాయి. ఇవ్వన్నీ ఏపీని అభివృధి బాటలో నడిపిస్తున్న కూటమి పై ప్రజల్లో నమ్మకం బలపడుతోంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.






