ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం.. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
ఆర్థిక, వ్యవసాయ, ఆక్వా, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఆండ్రూ ఫ్లెమింగ్, ముంబైలోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ దక్షిణాసియా కమిషనర్ అలన్ గెమ్మెల్ ఓబీఈ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్‌మాలి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించాలని మంత్రి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌ను కోరారు. దీనిపై ఫ్లెమింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, ఇక్కడ పవన్ విద్యుత్ ఉత్పత్తికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు యూకేకు చెందిన కంపెనీలు ఆసిక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో ఐటీ రంగానికి అనువైన అన్ని మౌలిక సదుపాయాలు, మానవవనరులు ఉన్నాయని తెలిపారు. అలన్ గెమ్మెల్ ఓబీఈ మాట్లాడుతూ మెరైన్, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. ఏపీ, బ్రిటిష్ ప్రభుత్వాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించేందుకు ఇక్కడ ఏపీతో కలిసి ష్రింప్ సమ్మిట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.






