Thammineni: శ్రీకాకుళం వైసీపీలో వర్గ రాజకీయాలకు బ్రేక్? తమ్మినేనిపై జగన్ కీలక నిర్ణయం
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వైసీపీ (YCP)లోపలి పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచే వర్గాల మధ్య పోటీ ఉండేది. తాజాగా ఆ పోరు సామాజిక సమీకరణల దిశగా మళ్లడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. కాళింగులు – వెలమలు అనే విభజన రాజకీయ రంగు పులుముకోవడంతో పార్టీ ఇరుకున పడుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు వైసీపీకి బలమైన ఆధారంగా ఉన్న ధర్మాన కుటుంబం (Dharmana Family) ఉంటే, మరోవైపు కాళింగ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం పేరుతో భారీ సభ నిర్వహించడం జిల్లాలో చర్చకు దారి తీసింది.
ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Thammineni Seetharam) హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ధర్మాన సోదరులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఒక దశలో రాజకీయ ఆరోపణలు వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లడం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలోనే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం (Srikakulam Parliament Constituency) కో-ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాంనే కొనసాగిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు, జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే తీసుకున్నవిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) తమ్మినేనిని రాజ్యసభకు పంపించి కొత్త యువ నేతకు ఎంపీ టికెట్ ఇవ్వొచ్చని వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేగింది. ఆ ప్రకటన తర్వాత పార్టీ శ్రేణుల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి.
బలమైన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విమర్శలను దువ్వాడ శ్రీనివాస్ మరింతగా ముందుకు తీసుకెళ్లడంతో పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది. తర్వాత కృష్ణదాస్ వివరణ ఇచ్చినా, అప్పటికే సామాజిక వర్గాల మధ్య అనుమానాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో తమ్మినేనికి మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా జగన్ స్పష్టమైన సంకేతం ఇచ్చారని అంటున్నారు.
ఇప్పుడు తమ్మినేని సీతారాం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసే అవకాశాలపై చర్చ సాగుతోంది. గతంలోనే ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై కొన్ని ఆశలు పెట్టుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం పార్టీ తీసుకున్న నిర్ణయం ద్వారా జిల్లాలో ఉన్న వర్గ విభేదాలను తగ్గించి, అందరినీ కలుపుకుని వెళ్లాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపై అయినా వైసీపీ లోపలి సామాజిక వర్గ పోరు తగ్గి, పార్టీ సమిష్టిగా ముందుకు సాగుతుందా అన్నది చూడాల్సిన అంశంగా మారింది.






