Banakacharla: బనకచర్లకు బ్రేక్.. ఎందుకంటే..!?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) గోదావరి జలాల (Godavari) తరలింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు (Polavaram Banakacharla Link Project) ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు తరలించాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు దాని స్థానంలో పోలవరం-నల్లమలసాగర్ (Nallamala Sagar) అనుసంధానం ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చింది. అందులో భాగంగానే గతంలో బనకచర్ల ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ కోసం పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ రద్దు చేసింది. ఆర్థిక భారం తగ్గించుకోవడంతో పాటు తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆమోదం పొందే ఆలోచనలో భాగంగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత ప్రణాళిక ప్రకారం, మొదటి దశలో గోదావరి నీటిని బొల్లాపల్లి జలాశయానికి తరలిస్తారు. అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయానికి మళ్లిస్తారు. అవసరాన్ని బట్టి ఈ జలాలను సోమశిలకు కూడా మళ్లించే అవకాశం ఉంటుంది. బనకచర్లకు నీటిని తరలించే అంశాన్ని మాత్రం ప్రభుత్వం తదుపరి దశలో చేపట్టాలని నిర్ణయించింది. ఈ మార్పుల నేపథ్యంలో, ఇకపై పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానంగానే ప్రాజెక్టును పరిగణించాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. అందుకే పాత పేరుతో ఉన్న డీపీఆర్ టెండర్లను రద్దు చేసి, త్వరలో కొత్త పేరుతో డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం కొత్తగా టెండర్లు పిలవనున్నారు.
ఈ ప్రాజెక్టు పరిధిని కుదించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. పాత అంచనా వ్యయం సుమారు 80 వేల కోట్లు. అయితే కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి 58 వేల కోట్లు మాత్రమే ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అంటే సుమారు 25 వేల కోట్ల మేర ఖర్చు తగ్గుతుంది. కొత్త ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా మూడు సెగ్మెంట్లలోనే చేపడతారు. తొలి సెగ్మెంట్ లో పోలవరం- ప్రకాశం బ్యారేజి అనుసంధానం చేపడతారు. దీనికి 13 వేల కోట్లు ఖర్చవుతుంది. రెండో సెగ్మెంట్ లో ప్రకాశం బ్యారేజి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ అనుసంధానే ఉంటుంది. బొల్లాపల్లిలో రిజర్వాయర్ నిర్మించి నీటిని పంపించేందుకు 36 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక కీలకంగా మారిన మూడో సెగ్మెంట్ పనులు బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్ జలాశయం వరకే పరిమితమవుతాయి. ఇందుకోసం 9 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు.
గతంలో బనకచర్ల వరకు అనుకున్నదానికన్నా ఇది చాలా తక్కువ. అంతేకాకుండా, నీటిని కూడా మరీ ఎత్తుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, కేవలం 250 మీటర్ల వరకు ఎత్తిపోస్తే సరిపోతుందని అంచనా. ఆర్థిక భారాన్ని తగ్గించుకొని, రాయలసీమకు నీటిని త్వరగా తరలించే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ కీలక మార్పులు చేపట్టినట్టు తెలుస్తోంది. అంతేకాక బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం.







