YS Jagan Auditors: జగన్ కొంప ముంచింది వీళ్లద్దరేనా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పేరు ఒకప్పుడు ఆశాకిరణంగా ఉండేది. వైఎస్ (YSR) వారసుడు కావడంతో అతనికి తిరుగులేని చరిష్మా లభించింది. అయితే ఇప్పుడు అవినీతి ఆరోపణలతో ఆయన ప్రతిష్ట మసకబారుతోంది. ఆయన సన్నిహితులైన ఆడిటర్లు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy), బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa) ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ అక్రమ ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులు వైఎస్ కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
విజయసాయి రెడ్డి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA). వైఎస్ కుటుంబంతో దశాబ్దాల సంబంధం కలిగి ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన విజయసాయి, జగన్ వ్యాపార సామ్రాజ్యానికి కీలక ఆడిటర్‌గా వ్యవహరించారు. 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) స్థాపనలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. అయితే, 2012లో సీబీఐ విజయసాయిని, జగన్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు చేసింది. ఆయనపై క్రిమినల్ కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, ఖాతాల గోల్‌మాల్ ఆరోపణలు ఉన్నాయి. సండూర్ పవర్ కంపెనీ షేర్ల విక్రయంలో రూ. 533 కోట్ల అవినీతిలో ఆయన పాత్ర ఉందని సీబీఐ ఆరోపించింది.
ఇటీవలి మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులోనూ విజయసాయి పేరు తెరపైకి వచ్చింది. రూ. 3,200 కోట్ల స్కామ్‌లో ఆయనను సీఐడీ అనుమానితుడిగా (A-5) పేర్కొంది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Raj), విజయసాయికి కిక్‌బ్యాక్‌లు బదిలీ చేసినట్లు వెల్లడించాడని రిమాండ్ రిపోర్టు తెలిపింది. అయితే విజయసాయి ఈ ఆరోపణలను ఖండించారు. తనకు మద్యం వ్యాపారంలో ఎలాంటి పాత్ర లేదని, రాజశేఖర్ రెడ్డే అన్ని లావాదేవీలు నిర్వహించాడని పేర్కొన్నారు. 2025 జనవరిలో ఆయన వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీనిని జగన్‌తో విభేదాలకు సంకేతంగా చూస్తున్నారు.
ఇక.. బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్స్ డైరెక్టర్. జగన్ భార్య భారతి (YS Bharathi) సన్నిహితుడిగా చెప్తున్నారు. మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా (A-33) ఉన్నారు. ఆయన్ను రెండ్రోజుల కిందట మైసూరు సమీపంలో అరెస్టు చేశారు. షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులను బదిలీ చేశారనేది బాలాజీ గోవిందప్పపై ఉన్న ప్రధాన ఆరోపణ. మద్యం సరఫరా ఒప్పందాల నుంచి నెలకు రూ. 50-60 కోట్ల కిక్‌బ్యాక్‌లను సేకరించాడు. ఈ నిధులు జగన్ నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌కు చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలాజీ గోవిందప్ప 2009 నుంచి విజయసాయి ఆధ్వర్యంలో జగన్ కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో పాలుపంచుకున్నారని సమాచారం. ఆ తర్వాత భారతి సిమెంట్స్ లో కీలక పాత్ర పోషించాడు.
విజయసాయి, బాలాజీ గోవిందప్ప.. జగన్ ఆర్థిక వ్యవహారాలకు వెన్నెముకగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. విజయసాయి జగన్ వ్యాపారాలకు వ్యూహాత్మక సలహాలు అందించగా, బాలాజీ గోవిందప్ప అక్రమ నిధుల సేకరణ, బదిలీలలో కీలకంగా పనిచేసినట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో వీరిద్దరూ రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసినట్లు సీఐడీ రిపోర్టులు సూచిస్తున్నాయి. జగన్ ఆదేశాలతోనే వీరు పనిచేశారా లేక వీరి సూచనలను జగన్ అంగీకరించారా అనేది స్పష్టంగా తెలియదు. అయితే వీరి చర్యలు జగన్‌పై ఆరోపణలను తీవ్రతరం చేశాయి.
ఈ అవినీతి ఆరోపణలు వైఎస్ కుటుంబ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీశాయి. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో జగన్ కు ఇప్పటికే ఆస్తి వివాదాలున్నాయి. ఈ సంఘటనలు కుటుంబంలో చీలికలను బయటపెట్టాయి. విజయసాయి రెడ్డి, బాలాజీ గోవిందప్పలు జగన్ ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్రలు పోషించారు. కానీ వాళ్ళ చర్యలు అవినీతి ఆరోపణలకు దారితీశాయి. జగన్ ఈ లావాదేవీలకు దూరంగా ఉండి ఉంటే, వైఎస్ కుటుంబం ఈ స్థాయిలో విమర్శలను ఎదుర్కొనేది కాదేమో..!