Bharath: కుప్పం భరత్ వైసీపీని వదిలేసినట్టేనా…?

వైసీపీ(Ysrcp) అధికారంలో ఉన్న సమయంలో.. కుప్పం నియోజకవర్గంలో అప్పట్లో పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు చిత్తూరు జిల్లాకు చెందిన కీలక నేతలు. అలాగే అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Ys Jagan).. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రాధాన్యత తగ్గించాలని.. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. అక్కడ ఎమ్మెల్సీ భరత్ ను అభ్యర్థిగా నిలబెట్టగా చంద్రబాబు నాయుడు మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
దీనితో కుప్పం నియోజకవర్గం లో వైసీపీ ఒకరకంగా అభాసుపాలు అయిందని చెప్పాలి. అక్కడ గెలిస్తే ఖచ్చితంగా భరత్ ను మంత్రిని చేస్తానంటూ అప్పట్లో జగన్ హామీ ఇవ్వడం కూడా ఒక సంచలనమైంది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై పోటీ పెట్టి.. గెలిస్తే మంత్రిని చేస్తానంటూ జగన్ మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ చేశారు టిడిపి కార్యకర్తలు. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత భరత్ పెద్దగా కనబడటం లేదు. ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు.
ఆయనపై ఇప్పటికే ఒక కేసు కూడా నమోదయింది. అయితే భరత్ విషయంలో వైసిపి అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదనే చెప్పాలి. ఇక భరత్ కూడా రాజకీయాల విషయంలో సైలెంట్ అయిపోయినట్లు అర్థమవుతుంది. తనని తాను కాపాడుకునే ప్రయత్నంలో.. ఆయన అవసరమైతే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
త్వరలోనే భరత్ పై కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. దీనితో భరత్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేయాలని, తన జాగ్రత్తలు తాను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కూడా సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక భరత్ కనబడటం లేదని వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ఆయన అవినీతి కార్యక్రమాలకు కూడా పాల్పడ్డారు అని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటకు తీసే అవకాశాలున్నాయి.