AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు.. బాలాజీ గోవిందప్ప అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను (Balaji Govindappa) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) మైసూరులో (Mysore) అదుపులోకి తీసుకుంది. అతన్ని విజయవాడకు (Vijayawada) తరలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy), జగన్ మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డికి (Krishna mohan Reddy) సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరటను అందించింది. అదే సమయంలో హైదరాబాద్‌లో నిందితుల కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.
సిట్ అధికారులు పక్కా సమాచారం ఆధారంగా బాలాజీ గోవిందప్పపై నిఘా పెట్టి మైసూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో సిట్ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలాజీ గోవిందప్ప కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా ఆర్డర్లు పొందిన కంపెనీలు, డిస్టిలరీల నుంచి నెలవారీగా రూ.50-60 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంలో బాలాజీ గోవిందప్ప కీలకంగా వ్యవహరించినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kesireddy Rajasekhar Reddy), అతని వ్యక్తిగత సహాయకుడు దిలీప్ కుమార్, మరో నిందితుడు చాణక్యలను సిట్ అరెస్టు చేసింది.
ఈ కేసులో ఇతర నిందితులైన కె.ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు మంగళవారం తాత్కాలిక ఊరట కల్పించింది. ఈ ఇద్దరినీ శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ లోగా కేసు దర్యాప్తుకు హాజరై అధికారులకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. బాలాజీ గోవిందప్ప అరెస్టు అక్రమమని అతని తరపు న్యాయవాది సిద్ధార్థ దవే వాదించగా, అరెస్టు సక్రమమా.. అక్రమమా అనే అంశంపై శుక్రవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
మరోవైపు.. మద్యం కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం సిట్ బృందాలు హైదరాబాద్‌లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నాయి. ఐదు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లోని నిందితుల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు చేపట్టాయి. ధనుంజయ రెడ్డి కుమారుడికి చెందిన ఒక కార్యాలయంలో సోదాలు నిర్వహించేందుకు సిట్ ప్రయత్నించింది. అయితే ఆ కార్యాలయం గతంలోనే ఖాళీ చేసినట్లు సిట్ గుర్తించింది. అలాగే కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సన్నిహితులకు చెందిన కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ముడుపుల సేకరణ, హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీల ద్వారా డబ్బు తరలింపుకు సంబంధించిన ఆధారాల కోసం సిట్ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.
సిట్ విచారణకు హాజరు కాకుండా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గోవిందప్ప బాలాజీ అరెస్టు కావడం ఈ కేసులో కీలక మలుపులకు దారితీసే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఇతర నిందితుల ముందస్తు బెయిళ్లను కోర్టులు తిరస్కరించాయి. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటే శుక్రవారం తర్వాత ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.