AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. పరారీలో కీలక నిందితులు..!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy), మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy), భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ (Govindappa Balaji) ప్రస్తుతం పరారీలో ఉన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న ఈ ముగ్గురు నిందితులు, కోర్టుల ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ చట్టాన్ని గౌరవించకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో పలు అవకతవకలు జరిగాయని, హవాలా మార్గాల ద్వారా డబ్బును లాండరింగ్ చేశారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను సిట్ ఏ31, ఏ32, ఏ33 నిందితులుగా చేర్చింది. మే 11న అంటే ఆదివారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో వీళ్లు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురూ హాజరు కాలేదు. హైదరాబాద్, విజయవాడలోని వారి నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది.
ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా మే 7న వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. విచారణ ప్రాథమిక దశలో ఉందని, కస్టోడియల్ ఇంటరాగేషన్ కీలకమని కోర్టు పేర్కొంది. అనంతరం, ఈ ముగ్గురూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, మే 8న జస్టిస్ జె. పర్దీవాలా వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ తదుపరి విచారణను మే 13కి వాయిదా వేశారు.
మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పరారీలో ఉండటం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ధనుంజయ రెడ్డి వంటి సీనియర్ ఐఏఎస్ అధికారి, గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవిని నిర్వహించిన వ్యక్తి, చట్టాన్ని గౌరవించకపోవడం పట్ల పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో ధనుంజయ రెడ్డి ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పారని చెప్తుంటారు.
ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను సిట్ అరెస్టు చేసింది. వీళ్ల ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే బిగ్ బాస్ ఎవరనేది తెలుస్తుందని సిట్ భావిస్తోంది. అయితే వీళ్లు విచారణకు హాజరు కాకుండా, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు. దీంతో వీళ్లను అరెస్టు చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.