Janasena: అధికారంలో ఉన్నామా? లేదా?.. జనసేన పార్టీలో పెరుగుతున్న అనిశ్చితి..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారంలో భాగమైన జనసేన పార్టీ (Janasena ) లోనూ కొన్ని అంతర్గత వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఇప్పుడు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారంతా తమ మాటలు నాయకత్వం వింటేనే మున్ముందు పురోగతి సాధ్యమవుతుందని కచ్చితంగా చెబుతున్నారు. అధికారంలో ఉన్నా, తమకు అసలు విలువ లేదనే భావన గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న నాయకుల మధ్య స్పష్టంగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాష్ట్రానికి మళ్లీ వైసీపీ (YSRCP) అధికారంలోకి రాకుండా చూడాలనే తపనతో ఎలాంటి రాజీకి వెనకాడకుండా ముందుకు సాగుతున్నారు. తన స్థాయిని తగ్గించుకుని సహకారం అందిస్తూనే ఉన్నారు. కానీ కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం తాము అధికారంలో ఉన్నామా లేదా అనే సందేహంలో ఉన్నారని అంటున్నారు. తమ నియోజకవర్గాల్లో అధికారికంగా పనిచేసేది తామే అయినా, అసలైన ఆధిపత్యం మాత్రం టీడీపీ (TDP) నేతల చేతుల్లోనే ఉందని వారు వాపోతున్నారు. తమ మాటలకు అధికారులు స్పందించకపోవడం వల్ల అసంతృప్తి ఎక్కువైందని చెబుతున్నారు.
ఇటీవల విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు వచ్చిన నాగబాబు (Nagababu) పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఒక మహిళా కార్పొరేటర్ తన వార్డులో పనులు ఏవీ జరగడం లేదని చెప్పారు. అయితే ఆమె మాట్లాడుతుండగానే మైక్ ఆఫ్ చేయడం ద్వారా ఆమె అసంతృప్తిని కలిగించింది. తర్వాత ఆమె భర్త కూడా ఆ వేదికపై సమస్యలను వివరించేందుకు ప్రయత్నించగా, టీడీపీపై చేసిన వ్యాఖ్యలతో నాగబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారని చెబుతున్నారు. పార్టీ సమస్యలను పార్టీ వేదికలపై చెప్పకపోతే ఇంకెక్కడ చెప్పాలి అని కొందరు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నాయకులు, కార్పొరేటర్లు కూడా తాము ప్రజల పనులు చేయించలేక పోతున్నామన్న బాధతో ఉన్నారు. అధికారుల దృష్టి టీడీపీ సీనియర్లవైపే ఉండటంతో జనసేనకు న్యాయం జరగడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి ఏమీ ఆశించకుండా కేవలం పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ఈ విషయం కాస్త బాధాకరంగా ఉంది.