Sasidhar: వైసీపీ అభిమానికి ఏపీపీఎస్సీ పోస్ట్.. మండిపడుతున్న టీడీపీ కేడర్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సభ్యుడిగా జేఎన్టీయూ (JNTU) అనంతపురం రిజిస్ట్రార్ డాక్టర్ సి.శశిధర్ (Dr C Sasidhar) నియామకం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నియామకంపై టీడీపీ (TDP) కేడర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. శశిధర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)తో సన్నిహిత సంబంధాలున్నాయని, గతంలో రాజధాని అమరావతికి (Amaravati) వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో టీడీపీ కేడర్ పోస్టులు పెడుతోంది. గతంలో కూడా ఇదే తరహా తప్పిదాలు చేసినట్లు గుర్తు చేస్తోంది.
డాక్టర్ సి.శశిధర్‌ను ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. శశిధర్ ప్రస్తుతం జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శశిధర్ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం తగదని, అక్కడ పునాదులకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని మాట్లాడారు. అంతేకాక ఏదో శుభకార్యంలో నాటి ముఖ్యమంత్రి జగన్, భారతిలతో సన్నిహితంగా ఫోటోలు దిగారు. ఆయన వైసీపీకి వీరాభిమాని అని అనంతపురం జేఎన్టీయూలో ఎవరినడిగినా చెప్తారంటూ టీడీపీ కేడర్ చెప్తోంది.
అలాంటి శశిధర్ ను ఎంతో కీలకమైన ఏపీపీపీఎస్సీ సభ్యుడిగా నియమించడంపై కేడర్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు పదవులు అనుభవించారని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్లకే పదవులు కట్టబెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎవర్ని ఏ పదవిలో నియమిస్తున్నారో చూసుకునే పరిస్థితి కూడా లేదంటూ హైకమాండ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇలాంటి వాళ్ల మాయలో పడి పదవులు కట్టబెడుతున్నారని, ఇదే జరిగితే అసలైన టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో అవకతవకలపై విచారణ జరుగుతోంది. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ ప్రభుత్వమే కేసులు పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అనుకూల వ్యక్తులను ఏపీపీఎస్సీలో నియమించడం సబబేనా అని కేడర్ ప్రశ్నిస్తోంది. ఏవైనా కీలక పోస్టులను భర్తీ చేసేటప్పుడు వాళ్ల పూర్వాపరాలు తెలుసుకోకుండా ఎవరో రెఫర్ చేయగానే ఆర్డర్లు ఇచ్చేస్తున్నారని, ఇదేనా కూటమి ప్రభుత్వం నుంచి కోరుకున్నది అని నిలదీస్తోంది. గతంలో కూడా వైసీపీకి చెందిన ఓ యువనేత నేరుగా ఉండవల్లిలో నారా లోకేశ్ ను కలిసి ఫోటో దిగారు. అదేమని అడిగితే ఓ కంపెనీ ప్రతినిధిగా వచ్చారని, తమకు అతను వైసీపీ నేత అనే విషయం తెలీదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అధిష్టానం.
మొత్తానికి శశిధర్ నియామకం టీడీపీలో లోటుపాట్లను ఎత్తిచూపింది. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు మరింత కసరత్తు చేయాల్సిన అవసరాన్ని తెలియజేసింది. సహజంగా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విపక్షాల నుంచి విమర్శలు వస్తుంటాయి. కానీ ఏపీలో మాత్రం విపక్షం కంటే ముందు సొంత పార్టీ నేతలే సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. ఇది టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే పలుమార్లు కేడర్ ఇలాంటి పొరపాట్లను ఎత్తి చూపింది. అయినా హైకమాండ్ మాత్రం ఇప్పటికీ తప్పులు చేస్తూనే ఉంది.