YCP: వైసీపీ సెంట్రల్ ఆఫీస్ తలుపు తట్టిన పోలీసులు!?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారం కోల్పోయినప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, ఆరాచకాలపై ఏపీలో కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వీటిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు జైళ్లకు వెళ్లారు. తాజాగా కర్నూలు బస్సు దహనం (Kurnool Bus Accident) కేసులో వైసీపీ నేతలు చేసిన కొన్ని కామెంట్స్ ఆ పార్టీ మెడకు చుట్టుకున్నాయి. అందులో భాగంగా ఆ పార్టీ సెంట్రల్ ఆఫీసుకు (YCP Central Office) పోలీసులు వెళ్లినట్లు వార్తలు అందుతున్నాయి.
కర్నూలు జిల్లాలో ఇటీవల వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. బైకర్ మద్యం సేవించి మొదట ప్రమాదానికి గురై చనిపోవడం, ఆ బైక్ రోడ్డుపై పడడం, దాన్ని గమనించకుండా బస్సు డ్రైవర్ వెళ్లడంతో అది ప్రమాదానికి దారి తీసింది. బస్సు పూర్తిగా దహనమైంది. ఈ కేసు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బైకర్ మద్యం సేవించి బైక్ నడపడం వల్లే ప్రమాదానికి గురై చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడిపై కేసు నమోదు చేశారు.
అయితే బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్లే బైకర్ ప్రాణాలు కోల్పోయాడని, ఆ బైక్ వల్లే బస్సు ప్రమాదం జరిగిందని వైసీపీ ఆరోపించింది. ఆ పార్టీ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ బెల్టు షాపుల్లోనే బైకర్ మద్యం తాగాడంటూ స్టోరీలు ప్రసారం చేసింది. అవే అంశాలను ఆ పార్టీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Anchor Syamala) కూడా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. అయితే శ్యామల వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. బైకర్లు బెల్ట్ షాపుల్లో మద్యం తాగలేదని, అనుమతి పొందిన మద్యం దుకాణాల్లోనే మద్యం కొనుగోలు చేశారని సీసీటీపీ ఫుటేజ్ ను బయట పెట్టారు. అదే సమయంలో బెల్ట్ షాపుల్లో మద్యం తాగినట్లు ఆరోపించిన శ్యామలను అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.
పోలీసుల నోటీసులు అందుకున్న శ్యామల కర్నూలు వెళ్లి విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె తనకు ఆ వివరాలు తెలీవని, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్టు ఆధారంగానే తాను మీడియా మందు మాట్లాడనని వివరణ ఇచ్చినట్లు సమాచారం. తనకు స్క్రిప్టు ఎవరిచ్చారనే వివరాలను కూడా ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. దాన్ని ఆధారంగా చేసుకున్న పోలీసులు, శ్యామల సహా బెల్ట్ షాపుల ఆరోపణలు చేసిన వారికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి (Pudi Srihari) నుంచి స్క్రిప్ట్ అందినట్లు గుర్తించారు. అందులో భాగంగా వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో పూడి శ్రీహరి విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.
గతంలో కూడా పలువురు నాయకులు తమకు కేంద్ర కార్యాలయం నుంచి స్క్రిప్ట్ అందుతుందని, అందులో ఉండే అంశాలనే తాము మీడియా ముందు మాట్లాడతామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా శ్యామల కూడా అదే మాట చెప్పింది. దీంతో స్క్రిప్టు ఎక్కడి నుంచి వస్తోందో గుర్తించిన పోలీసులు, నేరుగా అతడికే నోటీసులు ఇచ్చారు. ఇది పూడి శ్రీహరి దగ్గర ఆగుతుందా.. లేకుంటే ఆ పై నాయకులకు కూడా వెళ్తుందా.. అనే దానిపై ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.







