అశోక గజపతి రాజునే తిరిగి నియమించండి : ఏపీ హైకోర్టు

మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్‌గా అశోకగజపతి రాజును పునర్నియమించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం వీటికి చైర్‌పర్సన్‌గా ఉన్న సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు కొట్టేసింది. అశోక గజపతిరాజునే తిరిగి నియమించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సంచయిత గజపతిరాజు నియామక జీవోలను రద్దు చేయాలని సవాల్ చేస్తూ అశోకగజపతి రాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. మాన్సాస్ చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కొనసాగే అర్హత అశోక గజపతి రాజుకే ఉందని హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆయన వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సింహాచలం దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా ఆనంద గజపతి రాజు రెండో కుమార్తె సంచయిత గజపతి రాజును నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మాన్సాస్ ట్రస్టు బోర్డు చైర్మన్‌గా కూడా ఆమెనే నియమించింది ప్రభుత్వం. దీంతో గొడవ ప్రారంభమైంది. దీనిని సవాల్ చేస్తూ అనువంశిక ధర్మకర్తగా ఉన్న పూసపాటి అశోకగజపతి రాజు హైకోర్టుకెక్కారు. అయితే తాము రొటేషన్ ప్రకారమే నియమించామని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది.
న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యం : చంద్రబాబు
మాన్సాస్, సింహాచలం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు సీఎం జగన్‌కు చెంపపెట్టు అని అన్నారు. ఎన్ని అన్యాయమైన జీవోలు వచ్చినా, చివరికి ధర్మమే గెలించిందని సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు గుడ్డిగా జీవోలివ్వడం మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.