Aqua: ట్రంప్ టారిఫ్ లతో రొయ్య విలవిల..

ఏపీ ఆర్థిక వనరులపై ట్రంప్(Trump) టారిఫ్ ల ఎఫెక్ట్ పిడుగులా పడింది. మరీ ముఖ్యంగా రొయ్యల ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఎందుకంటే ఎక్కువగా మన రొయ్యలు ..ముఖ్యంగా వియత్నాం, థాయ్ లాండ్, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతాయి. వీటని ప్రాసెసింగ్ చేసి ఈదేశాలు.. అమెరికాకు పంపిస్తాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్… ఆ దేశాలపై అధిక ప్రతిసుంకాలు విధించారు. దీంతో వాటి నుంచి కొనుగోళ్లు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా ఆయా దేశాలు.. భారత్ కు ఇచ్చిన ఆర్డర్లను రద్దుచేస్తున్నాయి. ‘యూరోపియన్ యూనియన్‌లో 50% తనిఖీ, 4-7శాతం దిగుమతి సుంకం సహా నాన్ టారిఫ్ అడ్డంకులు భారతీయ ఎగుమతిదారులకు ఎదురవుతున్నాయి. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద జీరో డ్యూటీ పొందిన వియత్నాం వంటి దేశాలు.. అక్కడి మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయి
ఈ పరిస్థితులు భారతీయ ఆక్వా, మరీ ముఖ్యంగా ఏపీ ఆక్వారైతులను నష్టపరుస్తున్నాయి. తమ ఆర్డర్లు రద్దు కావడం, ఉన్నవాటిని మళ్లీ కోల్డ్ స్టోరేజుల్లో పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాటికి సైతం అద్దెలు కట్టాల్సి రావడం నష్టదాయకంగా మారుతోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఏపీ ప్రభుత్వం.. రైతులను కాపాడాలంటూ కేంద్రానికి విన్నవించుకుంది.
సుంకాల భారం నుంచి రొయ్యలకు మినహాయింపు ఇచ్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని.. ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షల మంది జీవనోపాధిని కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra babu) కేంద్రాన్ని కోరారు. అమెరికా సుంకాల కారణంగా ఇప్పుడు ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉత్పన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్(piyush) గోయల్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ‘భారత దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సముద్ర ఆహార ఉత్పత్తుల్లో 90% పైగా రొయ్యలే. 26% దిగుమతి సుంకం విధించడం వల్ల.. ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈక్వెడార్ వంటి దేశాలపై 10% మాత్రమే పన్ను విధిస్తోంది. ఇది భారతదేశానికి ప్రతికూలంగా, ఈక్వెడార్‌కు అనుకూలంగా మారుతుంది. అమెరికాకు వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతుంది’ అని పేర్కొన్నారు.
పోర్టుల్లో కంటెయినర్లు.. గోదాముల నిండా నిల్వలు
‘గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసిన సంస్థలు వాటిని ప్యాక్ చేసి శీతల గోదాముల్లో నిల్వ చేశాయి. కొత్త నిబంధనల కారణంగా వాటిపైనా సుంకాల భారం పడుతుంది. శీతల గోదాములు నిండుకోవడంతో.. చెరువుల నుంచి పట్టే రొయ్యలను ఎక్కడ నిల్వ చేయాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది’ అని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో చంద్రబాబు వివరించారు. ‘ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులకు సమస్యలు తలెత్తాయి. ఆక్వా రంగాన్ని పరిరక్షించే చర్యలు తీసుకోండి. పన్నుల మినహాయింపు జాబితాలో రొయ్యలను చేర్చేలా చూడండి’ అని చంద్రబాబు కోరారు.
మరోవైపు..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఉత్పత్తులపై విధించిన సుంకాల వల్ల ఆక్వా రంగంపై పడిన ప్రభావాన్ని అంచనా వేసి రైతులు, పరిశ్రమను ఎలా ఆదుకోవాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దేశీయంగా రొయ్యల వినియోగాన్ని పెంచటానికి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆక్వా రైతులను గట్టెక్కించటానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.