Chandrababu : అమరావతికి డైనమిక్ సిటీగా ప్రపంచ గుర్తింపు..జగన్ విమర్శలకు బాబు కౌంటర్
ఏపీ రాజధాని అమరావతి (Amaravati)పై వైసీపీ (YCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలు ఇటీవల రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. అమరావతి రాజధానిగా అనుకూలం కాదని, అక్కడ మౌలిక సదుపాయాల కొరత ఉందని జగన్ విమర్శించారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ అవసరమా? అని ప్రశ్నిస్తూ, వేలాది ఎకరాల భూసేకరణ సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి.
జగన్ చేసిన ఈ విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేరుగా ప్రెస్ మీట్ పెట్టి స్పందించలేదు. కానీ విజయవాడ (Vijayawada)లో నిర్వహించిన ‘ఆవకాయ అమరావతి’ (Avakai Amaravati) టూరిజం ఫెస్టివల్ వేదికగా ఆయన పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఎలా బాధపడినా సరే అమరావతి ప్రపంచ స్థాయి డైనమిక్ సిటీగా మారుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మాటల్లో జగన్ విమర్శలకు స్పష్టమైన సంకేతం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అమరావతి పేరులోనే జయం ఉందని, అపజయం అనే మాటకు అక్కడ చోటే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చెందుతుందని, విజయవాడ, గుంటూరు (Guntur), మంగళగిరి (Mangalagiri) ప్రాంతాలు అన్నీ అమరావతిలో భాగంగా మారతాయని చెప్పారు. అమరావతిని కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఏపీకి అతిపెద్ద ఆదాయ వనరుగా టూరిజం మారనుందని చంద్రబాబు వెల్లడించారు. రాబోయే పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల నుంచి లక్ష వరకు హోటల్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఇప్పటివరకు గోవా (Goa) బీచ్‌ల గురించే దేశమంతా మాట్లాడుకుంటుందని, త్వరలోనే సూర్యలంక బీచ్ (Suryalanka Beach) అందాల గురించి చర్చ జరిగే పరిస్థితి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
పోలవరం (Polavaram) ప్రాంతంలో పాపికొండలు (Papikondalu), ఫ్లెమింగో ఫెస్టివల్స్ నిర్వహిస్తామని, అలాగే గండికోట (Gandikota), అరకు (Araku) ఉత్సవాలు పర్యాటకాన్ని మరింత పెంచుతాయని చంద్రబాబు తెలిపారు. అరకు కాఫీ (Araku Coffee) ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందుతోందని ఆయన గుర్తు చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆవకాయ (Avakaya) అంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుందని, కానీ ఆవకాయ ఒక్కటే కాదు… ఏపీ ఆహార సంస్కృతి ఎంతో సంపన్నమైందని చంద్రబాబు అన్నారు. ఆతిథ్యం, ఆహార పరిశ్రమలో ఏపీకి మించిన రాష్ట్రం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయని బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) నివేదిక స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు.
తెలుగు భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, కలిసిమెలిసి జీవించడం తెలుగు సంస్కృతిలో భాగమని చంద్రబాబు చెప్పారు. సంస్కృతి, సాహిత్యం, సినిమా… ఇవన్నీ తెలుగు ప్రజల అసలైన బలమని పేర్కొంటూ, అమరావతి కేంద్రంగా ఏపీ భవిష్యత్ ప్రకాశవంతంగా ఉంటుందని ఆయన స్పష్టమైన సంకేతం ఇచ్చారు.






