Andhra Pradesh: అభివృద్ధి కోసం ఏపీ వీకేంద్రీకరణ దిశగా కూటమి కొత్త అడుగు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో పరిపాలనలో మరిన్ని సంస్కరణలు చేపట్టడానికి టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా పెంచే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ దిశగా ఇప్పటికే సంబంధిత శాఖలు కసరత్తు ప్రారంభించాయి. జిల్లాల పునర్విభజనపై సమగ్రంగా పరిశీలించేందుకు మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటైంది. ఎన్నికల ముందు టీడీపీ కూటమి తమ మేనిఫెస్టోలో కొత్త జిల్లాల ఏర్పాటు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే వైసీపీ (YCP) పాలనలో తగిన ప్రణాళిక లేకుండా సృష్టించిన కొన్ని జిల్లాల్లో మార్పులు తీసుకురావాలని కూడా ప్రకటించింది.
ఈ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం కొత్త సంవత్సరానికి ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. వచ్చే 2026 జనవరి 26న కొత్త జిల్లాలను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. పాలన సులభతరం కావడం, ప్రజల సెంటిమెంట్లు, అభివృద్ధి అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ కొత్త జిల్లాల ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం చర్చలో ఉన్న ఆరు జిల్లాలు పలాస (Palasa), మార్కాపురం (Markapuram), మదనపల్లె (Madanapalle), గూడూరు (Gudur), రాజంపేట (Rajampet) , అమరావతి (Amaravati).
ఈ జిల్లాల ఏర్పాటుతో స్థానిక ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని పలాసను వేరు చేసి కొత్త జిల్లా చేయాలని ఆలోచన ఉంది. అలాగే ప్రకాశం (Prakasam) జిల్లాలో గతంలో ఉన్న అద్దంకి (Addanki), కందుకూరు (Kandukur) నియోజకవర్గాలను మళ్లీ అదే జిల్లాలో కలపాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వైసీపీ హయాంలో ఈ రెండు ప్రాంతాలను వరుసగా బాపట్ల (Bapatla) , నెల్లూరు (Nellore) జిల్లాలలో కలిపారు. కానీ ప్రజల అభిప్రాయం మేరకు ఇప్పుడు వాటిని తిరిగి ప్రకాశం జిల్లాకు విలీనం చేయాలనే సూచనలు వస్తున్నాయి.
ఇక మంత్రి వర్గ ఉప సంఘం అన్ని విన్నపాలను, స్థానిక ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదిక త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చకు రానుంది. ఆ తర్వాత ఆమోదం పొందిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఇప్పటికే 10 ఉమ్మడి జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి అభివృద్ధి వేగాన్ని పెంచినట్లు, ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రం భౌగోళికంగా పెద్దదిగా ఉండటంతో పాటు జనాభా కూడా ఎక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న జిల్లాలుగా విభజించడం ద్వారా పాలన సమర్థవంతంగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయికి వేగంగా చేరుతాయని, కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి నిధులు సులభంగా వినియోగించుకోవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద, 32 జిల్లాల రూపకల్పన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకు నాంది అవుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.







