లంబసింగిలో అగ్రి టూరిజం…పెరిగిన ఆదాయం
ఆంధ్రా కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగి పరిసర ప్రాంతాలు అగ్రి టూరిజం కేంద్రాలుగా మారాయి. దాంతో పర్యాటకుల రాకతో ఇక్కడి గిరిజనులకు మంచి ఆదాయం వస్తోంది. దానికితోడు ఇక్కడ ఉన్న విదేశీ పూల సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిశోధనలు ఫలించడంతో సంప్రదాయ పంటలు సాగు చేసే గిరిజనులకు పూల సాగుపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా గిరి సీమల్లో పూలసాగు విస్తరణకు బాటలు పడ్డాయి. పూల వనాలను చూసేందుకు పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న టోకెన్ చార్జీల ద్వారా సీజన్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఈ ప్రాంత రైతులు అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు.
నాణ్యమైన పూలు ఉత్పత్తి అవుతుండడంతో నర్సీపట్నం, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నుంచి హోల్‌సేల్ పూల వ్యాపారులు నేరుగా రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. రకాన్ని బట్టి ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తుండగా.. పెట్టుబడులు పోను రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం వస్తోంది. విదేశీ పూల రకాల సాగుకు లంబసింగి పరిసర ప్రాంతాలు ఎంతో అనువైనవి. గిరిజన రైతులు ఇప్పుడిప్పుడే ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. పూల సాగుతో పాటు పర్యాటకం ద్వారా కూడా మంచి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. సాధారణంగా కొండ ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, వలిశెలు, రాజ్మా చిక్కుళ్లుతో పాటు పసుపు, అల్లం, కాఫీ వంటి పంటలు సాగు చేస్తుంటారు. అకాల, అధిక వర్షాల వల్ల ఆశించిన దిగుబడులు రాక గిరిజనులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో చట్టవిరుద్ధమైన గంజాయి తదితర పంటల్ని సాగు చేస్తూ కొందరు తరచూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మళ్లించే లక్ష్యంతో గిరిసీమల్లో వాణిజ్య పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించింది.
చింతపల్లి పరిశోధనా కేంద్రం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే విదేశీ పూల సాగుపై విస్తృత పరిశోధనలు చేసింది. రెండేళ్లుగా గ్లాడియోలన్, లిబియం, చైనా ఆస్టర్, జెర్బరా, తులిప్ వంటి విదేశీ పూల మొక్కల సాగుపై జరిపిన పరిశోధనలు ఫలించాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్ నుంచి తెచ్చిన సీడ్స్‌తో లంబసింగి ప్రాంతంలో ప్రయోగాత్మక సాగు సత్ఫలితాలనివ్వడంతో ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. విదేశాలతోపాటు హిమాచల్‌ప్రదేశ్, శ్రీనగర్, బెంగళూరు, పూణే, మదనపల్లి ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి వివిధ రకాల పూల రకాలను రైతులకు అందిస్తున్నారు. రైతు క్షేత్రాల్లో డ్రిప్ ఏర్పాటు చేసి ఎత్తయిన బెడ్లు, మల్చింగ్ విధానంలో సాగు చేయడంతో 45 రోజుల్లోనే దిగుబడులు మొదలవుతున్నాయి.






