Jagan: పార్టీని గెలిపించాల్సిందే మీరే.. జిల్లా అధ్యక్షులకు జగన్ దిశా నిర్దేశం..

పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెంచారు. జిల్లాల్లో మీరే సర్వం.. మీరే పార్టీ.. పార్టీయే మీరు.. అంతే కాదు జిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే అంటూ జిల్లా అధ్యక్షులపై కీలక బాధ్యతలు మోపారు. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన జగన్.. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తూ.. కీలక సూచనలు చేశారు.. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu government) పూర్తిగా విఫలమైంది.. రెడ్ బుక్(Red book) రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది.. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు.. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విధ్వంసమే.. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది.. మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.. అయితే, రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది.. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి.. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి అని సూచించారు..
సాధారణంగా రెండు, మూడు సంవత్సరాలు అయితే కానీ.. ప్రభుత్వంపై వ్యతిరేకత బయటకు కనిపించదు.. కానీ, ఏడాదిలోపే కూటమి ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా వచ్చిందన్నారు వైఎస్ జగన్.. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి.. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.. జిల్లాలో పార్టీ ఓనర్‌షిప్ మీది.. ప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాల కోసం మీరు ఎదురు చూడొద్దు.. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలని స్పష్టం చేశారు.. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే.. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీని ద్వారానే మీ పనితీరు బయటపడుతోందన్నారు జగన్..
మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలి.. జూన్-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్ కమిటీలు పూర్తిచేయాలి.. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలి.. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారని తెలిపారు.. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి… జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనదని.. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలన్నారు.. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది. జిల్లాల్లో మీరే సర్వం.. మీరే పార్టీ.. పార్టీయే మీరు. జిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీదే.. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలని దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత..
జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది.. అది మీ ప్రధాన బాధ్యత.. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు జగన్.. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం అన్నారు.. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందన్నారు జగన్.