Washington: మిత్రుడు చేయాల్సిన పనికాదు.. ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రపంచదేశాల ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని.. అయితే కనీసం 10% సుంకం (Tariffs) చెల్లించాలని ఆయన స్పష్టంచేశారు. ట్రంప్ ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన ఫ్రెండ్ అయితే ఇలాంటి పని చేయడని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ (Anthony Albanese) పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా (Australia) దిగుమతులపై ట్రంప్ 10 శాతం సుంకం ప్రకటించారు. దీనిపై ఆల్బనీస్ మాట్లాడుతూ.. ‘ఇది నిజమైన స్నేహితుడు చేసే చర్య కాదు. ఈ సుంకాలు ఊహించనివి కావు. కానీ, అవి పూర్తిగా అసంబద్ధమైనవి. ట్రంప్ టారిఫ్ చర్యలకు అమెరికన్ ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పుదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇటలీ (Itali) ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) సైతం ట్రంప్ సుంకాలపై స్పందిస్తూ.. ఈయూ దిగుమతులపై సుంకాలు వేయడం ఇరుపక్షాలకు సరికాదన్నారు. దీనిపై యూఎస్‌తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాము వాణిజ్య యుద్ధం కోరుకోవడం లేదని, యూఎస్‌తో కలిసి టారిఫ్‌లపై ఒక ఒప్పందం చేసుకుంటామని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ పేర్కొన్నారు. ఇది ఇరుదేశాల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తుందన్నారు.
ప్రతీకార సుంకాలు విధిస్తాం
అమెరికా ఇప్పటికే కెనడా (Canada) దిగుమతులపై 25 శాతం సుంకం వసూలుచేస్తోంది. ఈక్రమంలో ట్రంప్ తాజా ప్రకటనపై ఆ దేశ నూతన ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) స్పందించారు. ట్రంప్ భారీ సుంకాలకు వ్యతిరేకంగా పోరాడతామని, ప్రతీకార సుంకాలు తాము విధిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అధ్యక్షుడి చర్య మిలియన్ల మంది కెనడియన్లపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తోందన్నారు. ఈ వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనకరం కాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) వ్యాఖ్యానించారు. టారిఫ్‌లపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జర్మనీ, స్పానిష్‌తో సహా ఇతర దేశాలు సైతం ఇదేవిధంగా ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. ట్రంప్ టారిఫ్‌లను తట్టుకునేందుకు బ్రెజిల్ ప్రభుత్వం బుధవారం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించింది.