మైక్రోసాఫ్ట్ ఎర్రర్ టెర్రర్…

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలన్నీ శుక్రవారం చిగురుటాకులా వణికిపోయాయి. చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో దీని ప్రభావం తక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం.మైక్రోసాఫ్ట్ విండోస్‌తో పనిచేసే కంప్యూటర్లలో తాము విడుదల చేసిన ‘అప్‌డేట్’లో లోపాల కారణంగానే సమస్య తలెత్తిందని క్రౌడ్‌స్ట్రైక్ వెల్లడించింది. కొద్ది గంటల్లోనే సమస్యను గుర్తించామని, దాన్ని పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే కొన్నిచోట్ల చిన్నచిన్న అవశేష సమస్యలున్నాయని త్వరలోనే అవీ పరిష్కారమవుతాయని పేర్కొంది.
తీవ్ర ప్రభావం
తాజా సాంకేతిక సమస్యతో మైక్రోసాఫ్ట్ సంస్థ సేవలు అంతర్జాతీయంగా ప్రభావితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థ సేవలను పొందుతున్న అనేక సంస్థలకు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. వేల మంది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచ్చింది. పలు విమాన సర్వీసులు రద్దుకావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారత్‌లోని పలు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు, బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 1 సహా చాలా విమానాశ్రయాల్లో విమానసర్వీసులకు ఆటంకాలు ఎదురయ్యాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు దిగ్గజ విమానయాన సంస్థలైన స్పైస్‌జెట్, ఇండిగో ప్రకటించాయి. దీంతో ప్రయాణికులను మాన్యువల్‌గా తనిఖీ చేసి చేతి రాతతో కూడిన బోర్డింగ్ పాస్‌లు ఇస్తున్నారు.
ఇబ్బందులు పడ్డ వీసా, అమెజాన్
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సాంకేతిక సమస్యతో అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా వంటి విమానయాన సంస్థలతోపాటు వీసా, ఏడీటీ సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇబ్బందిపడ్డాయి. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, స్కై న్యూస్ టీవీ, రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి. బ్రిటన్, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా వేర్వేరు దేశాల్లోని ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీల్లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్‌గా బోర్డింగ్ పాస్‌లు జారీ చేయాల్సి రాగా ప్రయాణాలు ఆలస్యమయ్యాయి.
దేశీయంగా స్వల్ప అవాంతరాలే : ఆర్‌బీఐ
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో మనదేశంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ)లు, స్టాక్‌బ్రోకింగ్ సంస్థల కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది. దాదాపు 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, నెమ్మదిగా మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు పేర్కొంది. ‘కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్‌స్ట్రైక్ టూల్ వినియోగిస్తున్నాయి. బ్యాంకుల్లోని కీలక సిస్టమ్స్ క్లౌడ్ నెట్‌వర్క్ మీద లేవు. అందువల్ల కొన్ని చిన్న ఇబ్బందులు మాత్రమే కనిపించాయి’ అని ఆర్‌బీఐ వివరించింది. మొత్తం మీద చూస్తే మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ వైఫల్య ప్రభావం మనదేశంలో ఎంతో తక్కువని పేర్కొంది.
‘ఎర్రర్’ నుంచి బయటపడేదిలా..
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్యతో కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో ఆయా సిస్టమ్‌లు షట్‌డౌన్/ రీస్టార్ట్ అయ్యాయి. ‘‘విండోస్ సరిగా లోడ్ కాలేదు. రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి’’ అంటూ సందేశం చూపిస్తోంది. బ్లూ స్క్రీన్‌లో కనిపిస్తున్న ఈ ఎర్రర్స్‌ను బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్ లేదా స్టాప్ కోడ్ ఎర్రర్స్‌గా పిలుస్తారు. దీనివల్ల విండోస్ ఒక్కసారిగా షట్‌డౌన్, లేదా రీస్టార్ట్ అవుతుంది.
సాధారణంగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల ఈ ఎర్రర్స్ తలెత్తుతుంటాయి. ఇటీవల విండోస్‌లో చేపట్టిన క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది. తాజా బ్లూస్క్రీన్ ఎర్రర్‌ను ఎలా పరిష్కరించాలి (ట్రబుల్ షూట్ చేయాలి) అనే విషయాన్ని సూచించింది. సిస్టమ్‌ను సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్‌లో ఓపెన్ చేయాలి. తర్వాత C:\Windows\System32\drivers\CrowdStrike అనే డైరెక్టరీలోకి వెళ్లాలి. అందులో Cn00000291*./~ys అనే ఫైల్ ఉంటే డిలీట్ చేయాలి. తర్వాత యథావిధిగా సిస్టమ్‌ను బూట్ చేయడం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విండోస్ అప్‌డేట్ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొంది.