Iran vs Israel: 2018 జనవరి 31, ఇరాన్ లో మోసాద్ ఏం చేసింది..?
మిడిల్ ఈస్ట్ దేశాల్లో కీలకంగా ఉన్న ఇజ్రాయిల్(Israel), ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయిల్ గూడచారి సంస్థ మోసాద్(Mossad) చర్యలు ఇరాన్ కు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. జూన్ 13 తెల్లవారుజామున.. ఇజ్రాయెల్, ఇరాన్‌పై ముందస్తు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంపై.. 100 కి పైగా వైమానిక, డ్రోన్ దాడులు, కీలకమైన అణు, సైనిక మరియు నిఘా వ్యవస్థలపై ఎక్కువగా దాడి చేసింది ఇజ్రాయిల్.
అణు కర్మాగారాలు, రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, క్షిపణి నిల్వలు, రహస్య ప్రదేశాలపై ఇజ్రాయిల్ గురి పెట్టింది. అయితే తమ దేశంలో ఇజ్రాయిల్ గూడచారి సంస్థ.. మోసాద్ పని తీరు ఎలా ఉందో ఇరాన్ ను భయపెడుతోంది. తమ సైనికాధికారులను హతమార్చడంతో పాటుగా, పక్కా సమాచారం అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టడం, నిఘా వ్యవస్థలపై దాడులు చేయడం, క్షిపణి నిల్వలను లక్ష్యంగా చేసుకోవడం వంటివి ఇరాన్ కు చెమటలు పట్టిస్తున్నాయి. ఇటీవల 20 మంది గూడచారులను ఇరాన్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ మరో ఆసక్తికర విషయాన్ని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. దాదాపు ఏడేళ్ళ క్రితమే ఇరాన్ అణు స్థావరాలను ఇజ్రాయిల్ టార్గెట్ చేసిందని పేర్కొంది. జనవరి 31, 2018 రాత్రి, ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్ల చిన్న బృందం దక్షిణ టెహ్రాన్‌లోని ఒక గౌదాన్ లోకి వెళ్లిందని.. వారికి ఉన్న 6 గంటల 29 నిమిషాల సమయంలో పని పూర్తి చేసే టార్గెట్ చేసారని వెల్లడించింది. ఉదయం గార్డు షిఫ్ట్ కు రావడానికి ముందు అక్కడ ఉన్న వాటిని దొంగలించాలి అనే లక్ష్యంతో వెళ్లినట్టు పేర్కొంది.
వారు 50,000 పేజీల పత్రాలను, బ్లూప్రింట్లు(Nuclear Blueprints), సాంకేతిక రేఖాచిత్రాలు, ఛాయాచిత్రాలు, మెమోలు, ప్లానింగ్ తో కూడిన 163 CDలను దొంగిలించారట. ఇవన్నీ ఇరాన్ దీర్ఘకాలంగా తిరస్కరించిన అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించినవిగా అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏజెంట్లు, 32 సేఫ్ కౌంటర్ లను కరిగించే సామర్ధ్యం ఉన్న టార్చ్ లను ఉపయోగించి, బాంబు డిజైన్లు, వార్ హెడ్ డిజైన్ లకు ప్రాధాన్యత ఇస్తూ దొంగలించారట. కొన్ని ఓపెన్ చేయడానికి సాధ్యం కాకపోవడంతో వెనక్కు తిరిగి వచ్చేశారు అని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
ఇక ఉదయం వరకు ఇరాన్ దొంగతనం జరిగిందని గుర్తించలేదని, ఆ తర్వాత కౌంటర్ లు ఖాళీగా ఉండటం చూసి.. గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొంది. ఇక ఆ తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నేతన్యాహూ.. ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో ప్రపంచానికి అబద్దం చెప్తుందని పేర్కొన్నారు. దీనితో దొంగతనం జరిగినట్టుగా ఇరాన్ గుర్తించింది. అయితే అది నకిలీది అంటూ ఇరాన్ కొట్టిపారేసింది. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయిల్ పై సైబర్ దాడులను ప్రారంభించింది, ఇజ్రాయెల్ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుంది.






