Donald Trump: అమెరికా చదువు ఇక నాలుగేళ్లే… విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో పిడుగు..

అగ్రరాజ్యం అమెరికాలో విదేశీ విద్యార్థులకు వరుసగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే విదేశీ విద్యార్థులపై ఒకొక్కటిగా ఆంక్షలు విధిస్తున్న ట్రంప్.. ఇప్పుడు ఏకంగా చదువే సమయానికి గడువు విధించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వీసాల జారీకి ‘సోషల్ మీడియా వెట్టింగ్’ ను కఠినంగా అమలుచేస్తోన్న అగ్రరాజ్యం.. తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. విద్యార్థులు (US Student Visa), ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను ఆవిష్కరించింది. అంటే.. ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో (US Visa Rules) మార్పులు చేయనుంది.
ప్రస్తుతం ఎఫ్-1 వీసాలపై అమెరికా (USA)లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, జే-1 వీసాలపై వచ్చిన ఎక్స్ఛేంజ్ విజిటర్లకు ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ వెసులుబాటు ఉంది. అంటే.. వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటే.. అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఎక్స్ఛేంజ్ విజిటర్స్‌గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్ట్‌లు, ట్రైనీలు, ఇంటర్న్‌లు, ఫిజీషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. అయితే, ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టమ్‌లో మార్పులు తీసుకొచ్చేందుకు ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. ఈ వీసాలకు కూడా గడువు విధించేలా ‘పరిమిత కాల నివాస అనుమతి’తో కూడిన వీసాలను మంజూరుచేయాలని ప్రతిపాదించింది.
‘‘విదేశీ విద్యార్థులు, ఇతర వీసాదారులు అమెరికాలో నిరవధికంగా నివసింందుకు చాలాకాలంగా అమెరికాలోని గత ప్రభుత్వాలు అనుమతి కల్పించాయి. దీని వల్ల భద్రతాపరమైన ఇబ్బందులతో పాటు అమెరికన్లకు ప్రయోజనాలపై దెబ్బ పడింది. దీనికి ముగింపు పలికేలా కొత్త నిబంధనలను ప్రతిపాదించాం. కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నాం. దీనివల్ల ఫెడరల్ ప్రభుత్వంపై భారం తగ్గనుంది’’ అని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తమ నోటీసుల్లో పేర్కొంది.
ప్రతిపాదనల్లో సూచించిన మార్పులు ..
ఎఫ్, జే వీసా పొందిన విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు అమెరికాలో చదువుకునేందుకు గరిష్ఠ కాల పరిమితి నాలుగేళ్లుగా నిర్ణయించారు.
గ్రాడ్యుయేట్ స్థాయి ఎఫ్-1 విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రామ్‌లు మార్చుకుంటే ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎఫ్-1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే.. ఆ గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు.
విదేశీ మీడియా సంస్థల ప్రతినిధులు తీసుకునే ఐ-వీసాదారులు 240 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత మరో 240 రోజుల వరకు తమ నివాస అనుమతిని పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా చైనీస్ మీడియా ప్రతినిధులు అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే, విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా, లేదా అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఈ ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రతిపాదనలపై 30 లేదా 60 రోజుల వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండానే తక్షణమే అమల్లోకి వచ్చేలా దీనిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు.