Washington: ట్రంప్ సర్కార్ యాక్షన్ షురూ.. 6 వేల మంది విద్యార్థుల వీసా రద్దు..

ట్రంప్ సర్కార్ అన్నంత పనీ చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులని గతంలో గట్టిగా హెచ్చరించిన ట్రంప్ యంత్రాంగం.. ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను టార్గెట్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపైనా కఠిన చర్యలు తీసుకుంటోంది. లేటెస్టుగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల(USA Visa)ను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. 4,000 మంది విద్యార్థులు…దేశ చట్టాలు ఉల్లంఘించడం, దాడులు, మత్తులో డ్రైవింగ్, దోపిడీలకు పాల్పడటం వంటివి చేసినట్లు తెలుస్తోంది. అమెరికా చట్టాల్లోని ఐఎన్‌ఏ 3బీ కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ట్రంప్ రెండోసారి అమెరికా (USA) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్నత విద్యావ్యవస్థను పునర్ వ్యవస్థీకరించే పనిలో పడ్డారు. ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో పాలసీల మార్పులు చేపట్టారు. ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తొలుత జనవరిలో యాంటీసెమిటిజమ్‌ను(యూదులపై వ్యతిరేకత) అరికట్టేలా బిల్లును పాస్ చేశారు. అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపడితే ఈ ఆదేశాల ప్రకారం వారిని దేశ బహిష్కరణ చేయవచ్చు.
విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ జూన్‌లో ట్రంప్ కార్యవర్గం నిర్ణయం తీసుకొంది. అనంతరం సోషల్ మీడియా వెట్టింగ్‌ను కఠినతరం చేశారు. ఫారెన్ స్టూడెంట్స్ కచ్చితంగా వారి సామాజిక మాధ్యమ ఖాతాలు బహిర్గతం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల పోస్టులు, కామెంట్లు, లైక్‌లను అమెరికా అధికారులు పరిశీలించి.. వారు జాతీయ భద్రతకు ముప్పు కాదు అని భావిస్తే మాత్రమే వీసా ప్రక్రియలో ముందుకువెళతారు.
ఇక కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కేటాయించిన నిధుల్లో కోత విధించారు. క్యాంపస్‌ల్లో పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న చాలామంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేయించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులను నియమించుకోకుండా బ్లాక్ చేశారు. ఈక్రమంలో ట్రంప్ కార్యవర్గం, విశ్వవిద్యాలయం మధ్య న్యాయపోరాటం మొదలైంది.