పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు…
హమాస్ ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటం మరింత విస్తరిస్తోంది. మొన్నటివరకూ హమాస్ తో తలపడిన ఇజ్రాయెల్ దళాలు.. ఇప్పుడు ఇరాన్ తో పాటు హెజ్ బొల్లాతోనూ యుద్ధానికి సన్నద్దమయ్యాయి. ముఖ్యంగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్ లోనే ఐడీఎఫ్ బలగాలు మట్టుపెట్టడం.. ఆదేశానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.దీనికి ఇజ్రాయెల్ తప్పక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ పై భారీదాడులకు హెజ్ బొల్లా సిద్ధమైనట్లు సమాచారం.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన దగ్గరి నుంచి ఇజ్రాయెల్ గాజాలో భీకర దాడులు చేస్తోంది. అప్పటినుంచి సరిహద్దులో హెజ్బొల్లాకు టెల్ అవీవ్ సేనలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.. ‘‘హెజ్బొల్లా మరిన్ని లక్ష్యాలపై గురిపెట్టొచ్చు. ఇజ్రాయెల్ లోపల దాడులు జరగొచ్చని మేం అంచనా వేస్తున్నాం. తన ప్రతిస్పందనను మిలిటరీ లక్ష్యాలకే పరిమితం చేయదు’’ అని ఇరాన్ హెచ్చరించింది. మరోపక్క, ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగం దిశగా లెబనాన్ పలు రాకెట్లను ప్రయోగిస్తోంది కూడా. టెహ్రాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. దాడులు జరిగితే అండగా ఉంటామని భరోసానిచ్చారు. టెల్ అవీవ్‌కు అండగా ఉండేందుకు అమెరికా రంగంలోకి దిగింది. పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపిస్తోంది. ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అమెరికా దళాలు ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలిచాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులకు మన రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉంటూ భద్రతా నియమాలను పాటించాలని సూచించింది. భారత పౌరుల ప్రయాణాలకు సంబంధించి లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీచేసిన మరుసటి రోజు ఇజ్రాయెల్‌లోని కార్యాలయం మన పౌరులను అప్రమత్తం చేసింది.






