Khameni: యుద్ధం మొదలైంది.. అయతొల్లా ఖమేనీ పోస్టుతో పశ్చిమాసియాలో భయంభయం..
ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్య అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైందా..? ఇప్పటివరకూ జరిగిందంతా అడపాదడపా దాడులేనా..? ఈ యుద్ధం ఎక్కడి వరకూ వెళ్తుంది. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ‘యుద్ధం మొదలైంది’ అంటూ పోస్ట్ చేయడంతో సర్వత్రా చర్చ మొదలైంది. ఇతకూ ఖమేనీ వ్యాఖ్యల వెనక అర్థమేంటి..?
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో (Israel-Iran War) పశ్చిమాసియా రగులుతోంది. అగ్రరాజ్యం అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కన్పిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ (Iran) సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘యుద్ధం మొదలైంది’ అంటూ అందులో ఖమేనీ రాశారు.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ మంగళవారం ఓ పోస్ట్ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కొన్నారో తమకు తెలుసని పేర్కొన్న ఆయన.. ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదని అన్నారు. ఆయన బేషరతుగా లొంగిపోవాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ కన్పించింది. ‘‘నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్తో(కత్తి) కలిసి ఖైబర్‌కు వచ్చేశారు’’ అని అందులో రాశారు. దీంతోపాటు ఖడ్గం పట్టుకొని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫొటోను దీనికి జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. ఈ పోస్ట్ చూస్తుంటే.. యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
7వ శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్పై షియా ఇస్లాం మొదటి ఇమామ్ యుద్ధం చేసి అందులో విజయం సాధించారు. నాటి ఘటనను గుర్తుచేస్తూ ఖమేనీ ఈ పోస్ట్ పెట్టినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ కథనం పేర్కొంది. ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ సుప్రీంలీడర్ మరో పోస్ట్ చేశారు. ‘‘మేం బలంగా ప్రతిస్పందిస్తాం. ఎవరిపైనా దయ చూపేది లేదు’’ అంటూ అందులో రాసుకొచ్చారు.
కొనసాగుతున్న క్షిపణి దాడులు..
మరోవైపు, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. అటు టెల్ అవీవ్‌లోనూ పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలెంలోని అమెరికా ఎంబసీని శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది.







