మళ్లీ అధ్యక్షుడిగా పుతిన్..?
రష్యాలో మూడురోజుల పాటు అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోటీల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్.. హాట్ పేవరిట్ అని చెప్పొచ్చు. పేరుకు ముగ్గురు ప్రత్యర్థులు ఉన్నప్పటికీ.. వారెవ్వరికీ పుతిన్ ను సవాల్ చేసే స్థాయి లేదు.. వాస్తవానికి పుతిన్ ను సవాల్ చేస్తూ వచ్చిన అప్పొజిషన్ లీడర్ అలెక్సీ నావల్ని ఇటీవలే చనిపోవడంతో.. ఆ అడ్డు కూడా తొలగిపోయినట్లైంది. ఇప్పుడున్న ముగ్గురు ప్రత్యర్థులు క్రెమ్లిన్ అనుకూలురుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నా.. ఐదోసారి క్రెమ్లిన్ పగ్గాలను ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.
ఈ సారి రష్యాలోనే కాకుండా.. ఉక్రెయిన్‌లోని ఆక్రమించిన భూభాగాల్లోనూ మాస్కో ఎన్నికలను నిర్వహిస్తోంది. మొత్తం 11.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న 71 ఏళ్ల పుతిన్ ఈసారి నెగ్గితే 2030 వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌కు ప్రత్యర్థులుగా ముగ్గురు అభ్యర్థులనే ఆ దేశ ఎన్నికల కమిషన్ అనుమతించింది.
లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీకి చెందిన వ్లాదిస్లావ్ డవాంకోవ్, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ ఖరితోనోవ్ పోటీలో ఉన్నారు. చనిపోయిన రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీని .. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రజలు స్మరించుకున్నారు. ఆయన పుతిన్ సర్కార్ ను.. నిర్భందపాలనను దశాబ్దాలుగా నిలదీస్తూ వస్తున్నారు. ప్రాణాలకు ముప్పుందని తెలిసినా.. ఏమాత్రం వెనకంజ వేయలేదు. అంతేకాదు…ప్రజల్లోనూ చైతన్యదీప్తులు నింపుతూ వచ్చారు. అలాంటి నావల్నీ కొద్దిరోజుల క్రితమే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో పాశ్చాత్యప్రపంచం మొత్తం…పుతిన్ హత్య చేశారని ఆరోపించింది.






