Russia: ఇరాన్ కు రష్యా ఎందుకు సాయం చేయలేదు.. మిత్రదేశాన్ని ఎందుకలా వదిలేసిందో..?

మిత్రదేశం ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతున్న సమయంలో .. రష్యా (Russia) ఎందుకు సైలెంటైంది. అమెరికా బీ2 బాంబర్లు దాడులు జరుపుతున్న తరుణంలో.. జస్ట్ నోటిమాటతో ఖండించి ఎందుకు ఊరుకుంది. మిత్రులు కష్టకాలంలో ఉన్నప్పుడు రష్యా ఎందుకు గతానికి భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఓవిధంగా చెప్పాలంటే అమెరికాను ఢీ కొనేందుకు రష్యా సిద్ధంగా లేదా..? లేదంటే ఇటీవలి ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా బలహీనపడిందా..? దీనిపై రష్యా ఏమంటోంది..?
ఇరాన్‌కు మద్దతు విషయంలో తాము స్పష్టమైన విధానాన్ని అవలంబిస్తున్నామని రష్యా వెల్లడించింది. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఇరాన్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని రష్యా కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఇరాన్‌కు సైనిక మద్దతును రష్యా అందించలేదంటూ విశ్లేషకులు చేస్తున్న విమర్శపై ఆయన స్పందించారు. రష్యా అధినేత పుతిన్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సోమవారం భేటీ అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రష్యా పోషిస్తున్న పాత్రకు ఎంతో విలువ ఇస్తానని అరాగ్చి అన్నారని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా ఇటీవల ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. యుద్ధంలో తాము తటస్థంగా ఎందుకు ఉంటున్నామో పుతిన్ వివరించారు. ‘‘ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్‌కు చెందిన దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. మా దృష్టిలో ఇప్పుడది రష్యన్ భాష మాట్లాడే దేశమే. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ ఉద్రిక్తతల్లో మేం తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ప్రకటించారు. మిత్రదేశాలపై రష్యా నిజాయతీని కొంతమంది విమర్శిస్తున్నారని, వారంతా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారేనని మండిపడ్డారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందనడానికి స్పష్టమైన ఆధారాలే లేవని, ఆ దేశం చేపట్టే శాంతియుత అణు కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని చెప్పారు.
2022లో ప్రారంభమైన ఉక్రెయిన్ యుద్ధం రష్యా-ఇరాన్ అనుబంధాన్ని బలోపేతం చేసింది. ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు ఇరాన్ తన షహెద్ డ్రోన్లను, వాటిని తయారు చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యాకు అందించింది. ఈ డ్రోన్‌లు రష్యాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇరాన్-రష్యా సంబంధాల్లో నవశకం మొదలైందని 2025 జనవరిలో క్రెమ్లిన్ ప్రకటించింది. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనం కావడం, లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా బలహీనపడటం వంటి పరిణామాలు ఇరాన్‌కు వ్యూహాత్మక మిత్రుల అవసరాన్ని పెంచింది. అందుకే రష్యాపై ఆధారపడాలని ఇరాన్ భావించిందని పశ్చిమాసియా వ్యవహారాల విశ్లేషకుడు రెనాడ్ మన్సూర్ అన్నారు.