Jagan: నెల్లూరులో జగన్ టూర్ చుట్టూ రాజుకుంటున్న రాజకీయ రచ్చ..

జగన్ (Jagan) ఈ నెల 31న నెల్లూరు (Nellore) జిల్లాకు పరామర్శ పర్యటనకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ,వివాదాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, పోలీసులు వైసీపీ (YSRCP) నేతలకు ముందస్తుగా నోటీసులు జారీ చేయడం తీవ్ర అభ్యంతరం కలిగిస్తోంది. ఇది మరోసారి జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల వైఖరి పై చర్చకు దారి తీసింది.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) మాట్లాడుతూ, ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు అనవసర ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనకు ప్రత్యేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం లేదని, జగన్ అంటే ప్రజలే స్వచ్ఛందంగా వస్తారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి (Chandrasekhar Reddy)కి స్థానిక డీఎస్పీ నియమించిన ఆంక్షలు అనుచితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapureddy Prasanna Kumar Reddy) ఇంటికి జగన్ పరామర్శకు వెళ్లే సందర్భంలో కేవలం 15 వాహనాలకే అనుమతి ఇవ్వడం, ఇంట్లోపలికి జగన్ ఒక్కడికే ప్రవేశం అనుమతించడం వైసీపీ నేతలో కోపాన్ని రేపింది. అంతేకాక, రహదారి పరిస్థితులు సరిగా లేవని, ఎక్కువ మంది వస్తే అవాంఛనీయ సంఘటనలు జరిగితే వైసీపీ నేతలే బాధ్యత వహించాలని పోలీసులు హెచ్చరించారు.
ఇది మొదటిసారి కాదు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం (Bangarupalyam, Chittoor) ప్రాంతంలో జరిగిన జగన్ పర్యటనలో కూడా ఇలాంటి ఆంక్షలే విధించారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి మించి అనుమతి లేదని, మార్కెట్ యార్డులోకి కేవలం 300 మందికే ప్రవేశం ఉండాలని, తక్కువకు తక్కువ 2,000 మంది పోలీసు సిబ్బంది మోహరించారని భూమన తెలిపారు. తమవంతుగా జనసమీకరణ చేయలేదని చెప్పినా ప్రజలు భారీగా తరలివచ్చారని గుర్తు చేశారు.
ఇప్పుడు నెల్లూరు పర్యటనలో కూడా అదే తీరుగా పోలీసుల అణచివేత చర్యలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అయినా ప్రజల ఆదరణ మాత్రం తగ్గదని ఆయన ధీమాగా చెప్పారు. ప్రభుత్వం ఆంక్షలు పెట్టినప్పటికీ, ప్రజలు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు స్వయంగా వస్తారని స్పష్టం చేశారు. జనంలో జగన్ కి ఉన్న పాపులారిటీ చూసి కూటమి ప్రభుత్వం సహించలేకపోతోంది అని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి.దీంతో, జగన్ పర్యటన చుట్టూ మరోసారి రాజకీయ వేడి రాజుకుంటోంది.