కిమ్ ‘సూసైడ్’ డ్రోన్స్…
బలమే ప్రపంచంపై మన ఆధిక్యాన్ని పెంచుతుందని కచ్చితంగా నమ్మే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్. దేశం సవాలక్ష సమస్యలతో అతలాకుతలమవుతుంటే.. ఆయన మాత్రం ఆయుధాగారం నింపడంపై ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలు తయారు చేస్తూ.. ప్రపంచాన్ని బెదిరించే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా పొరుగున ఉన్న దక్షిణకొరియా, దానికి మద్దతుగా ఉన్న అమెరికాను బెదిరించేందుకు కిమ్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ వస్తున్నారు కూడా.
నిత్యం క్షిపణులు, శక్తిమంతమైన బాంబుల పరీక్షలతో వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో కొత్త ఆయుధం చిక్కింది. అదే సూసైడ్ డ్రోన్ . వీటి పనితీరును కిమ్ శనివారం స్వయంగా పర్యవేక్షించారు. వీటికి సంబంధించిన చిత్రాలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. తమ యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపర్చుకోవడానికి సూసైడ్ డ్రోన్ల తయారీని వేగవంతం చేస్తామని కిమ్ వెల్లడించారు. ఎక్స్ ఆకారపు రెక్కలు ఉన్న ఓ తెల్లటి డ్రోన్.. దక్షిణ కొరియాకు చెందిన కే-2 యుద్ధ ట్యాంకును పోలి ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేసినట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. సాధారణ డ్రోన్లు లక్ష్యానికి కొంత దూరంలో ఉండి క్షిపణుల ద్వారా దాడి చేస్తాయి.
తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించినవి మాత్రం అవే నేరుగా లక్ష్యంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టిస్తాయి. వివిధ దూరాలను ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న పలురకాల డ్రోన్లను శనివారం పరీక్షించినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది. భూమితో పాటు సముద్రంలోని లక్ష్యాలను సైతం ఈ డ్రోన్లు ఛేదిస్తాయని పేర్కొంది. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో దాడి చేయడానికి ముందు ఈ డ్రోన్లు వివిధ మార్గాల్లో ప్రయాణించాయని తెలిపింది. అంతర్జాతీయ సైనిక సామర్థ్యాలు, ఆత్మరక్షణ వ్యవస్థలను పరీశీలిస్తే డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికత ఎంత అవసరమో తెలుస్తోందని కిమ్ అన్నారు. ఈ నేపథ్యంలో వీటిని వీలైనంత త్వరగా సైన్యంలో చేర్చాలని అధికారులను ఆదేశించారు.
యావత్ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ దృష్టి సారించిన తరుణంలో కిమ్ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియాకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికాలోని లక్ష్యాలను సైతం చేరుకునే దీర్ఘశ్రేణి క్షిపణులను రూపొందిస్తున్నారు. అదే సమయంలో పొరుగున ఉన్న దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకునే స్వల్పశ్రేణి ఆయుధాలను సైతం సిద్ధం చేసుకుంటున్నారు. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఒత్తిడి పెంచాలనేదే కిమ్ లక్ష్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తద్వారా తమ దేశాన్ని అణ్వస్త్ర దేశంగా గుర్తించాలని కిమ్ ఆశిస్తున్నారని చెబుతున్నారు. ఫలితంగా ఆర్థిక, సైనికపరమైన ఆంక్షల నుంచి ఉపశమనం పొందాలనేది ఆయన లక్ష్యమని వివరించారు.






