Caracas: వెనెజువెలా అధ్యక్షుడు మదురో ప్రస్థానం ముగిసినట్లేనా..!
వెనెజువెలాలో అధికారప్రభుత్వాన్ని కూలదోయడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సక్సెసయ్యారు. చాలా ప్రీప్లాన్డ్‌గా స్కెచ్ అమలు చేశారు. కేవలం ఒక్కరోజులో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి, అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అరెస్ట్ చేశారు.ఈ పరిణామాన్ని రష్యా,స్పెయిన్ తీవ్రంగా ఖండించాయి .
తమ దేశంలో మాదక ద్రవ్యాల సరఫరా, హింసను ప్రేరేపించేందుకు నికొలస్ మదురో నేతృత్వంలోని వెనెజువెలా ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump).. ఆ దేశంపై భీకర దాడులు చేపట్టారు. అధ్యక్షుడు మదురోతోపాటు ఆయన సతీమణి సీలీయా ఫ్లోరెస్ని తమ కస్టడీలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో మదురో ప్రభుత్వాన్ని కూల్చాలన్న తన సంకల్పాన్ని ట్రంప్ దాదాపుగా నెరవేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు ఎదిగి.. దశాబ్దానికిపైగా వెనుజువెలాను పాలించిన మదురో ప్రస్థానం ఇక ముగిసినట్లే కనిపిస్తోంది.
మదురో ప్రస్థానం….
కారకస్‌లో 1962లో జన్మించిన మదురో.. బస్సు డ్రైవర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత యూనియన్ నేతగా ఎదిగారు. హ్యూగో చావెజ్ నేతృత్వంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలా (PSUV) చేరిన మదురో కీలక బాధ్యతలు చేపట్టారు. చావెజ్ ప్రభుత్వంలో 2006 నుంచి 2013 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. లాటిన్ అమెరికా- కరేబియన్ (ఏఎల్బీఏ) కూటమి ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. 2012లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన.. 2013లో చావెజ్ మరణంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
అనంతరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందిన ఆయన.. ఇప్పటివరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. అయితే, ఆయా ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన సతీమణి సీలీయా ఫ్లోరెస్ న్యాయవాది. అటార్నీ జనరల్‌గా పనిచేసిన ఆమె.. మొదటి భర్తతో విడాకుల తర్వాత మదురోను వివాహం చేసుకున్నారు.
తమ దేశానికి వెనుజువెలా వలసలను ప్రోత్సహిస్తోందని, నార్కో టెర్రరిజానికి పాల్పుతోందనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. ఆ దేశంలోని జైళ్లు, పిచ్చాసుపత్రులను ఖాళీ చేయించి మరీ వారిని బలవంతంగా అమెరికాకు వెళ్లేలా మదురో ప్రోత్సహిస్తున్నారనేది ట్రంప్ ఆరోపించగా.. మదురో ప్రభుత్వం ఖండించింది. దీనికితోడు అమెరికాకు పెద్దఎత్తున మాదక ద్రవ్యాల రవాణాకు కూడా వెనుజువెలానే కారణమని ట్రంప్ చేస్తున్న మరో ఆరోపణ. వెనుజువెలాకు చెందిన రెండు డ్రగ్ ముఠాలకు మదురోనే నాయకుడని ట్రంప్ పలుమార్లు విమర్శించారు.
చమురుపై అసలు కన్ను..
ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనెజువెలా ఒకటి. 2014 తరవాత వీటి ధరలు పతనం కావడానికి తోడు అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలవల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఆకలికేకలు మిన్నంటాయి. ఈ క్రమంలో ఇక్కడి చమురుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న ట్రంప్ సర్కార్.. ఇందుకోసం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే అమెరికాకు డ్రగ్స్ సరఫరాలో మదురో ఉన్నాడని ఆరోపిస్తూ.. ప్రభుత్వం నుంచి దిగిపోవాలని హెచ్చరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సహకరిస్తే 50 మిలియన్ డాలర్ల (ప్రస్తుతం రూ.450 కోట్లు) రివార్డు అందిస్తామని కొంతకాలం క్రితం ఆఫర్ చేసింది. అంతేకాదు వెనుజువెలా ప్రతిపక్ష నేత కొరినా మచాడోకు, ట్రంప్‌నకు మధ్య రాజకీయంగా సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ట్రంప్ చర్యలకు ఆమె బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. ఇటీవల నోబెల్ శాంతి బహుమతి ఆమెకు వచ్చిన సమయంలో వారిద్దరూ ఫోన్లో సంభాషించుకున్నారు. ఈ క్రమంలోనే నేరుగా రంగంలోకి దిగిన ట్రంప్ సైన్యం.. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మదురోను కస్టడీలోకి తీసుకుంది.






