బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ముందు పెనుసవాళ్లు..?
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో చెలరేగిన ఆందోళనలతో షేక్ హసీనా సర్కార్ గద్దెదిగింది. ఆందోళనకారుల డిమాండ్లను అనుసరించి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సర్కార్ ముందు పెనుసవాళ్లు నిలిచాయి. ముఖ్యంగా దేశంలో శాంతిభద్రతలను నెలకొల్పడం.. అయితే ఆందోళనకారుల్లో అధికులు యూత్ ఉండడంతో.. వారు తాముచెప్పిందే సమాజం వినాలంటున్నారు తప్ప, తాము ఆలకిస్తామనడం లేదు. హసీనా హయాంలో అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానన్యాయమూర్తి, బ్యాంక్ గవర్నర్లు సహా అందరినీ రాజీనామా చేయాలని నినదించడంతో.. వారందరూ పదవులకు రిజైన్ చేశారు.
అయినా బంగ్లాదేశ్ లో కార్చిచ్చు ఆగడం లేదు. తాము అనుకున్నట్లుగానే సర్కార్ గద్దెదిగినా.. అల్లర్లు అంతం కావడం లేదు. మరీ ముఖ్యంగా హిందూ సమాజంపై .. అక్కడి ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. దేవాలయాలు ధ్వంసంచేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారు. రేప్ లు, ఆస్తుల లూటీ సాదారణమైంది. అది ఎక్కడి దాకా వచ్చిందంటే.. తమకు జీవించే హక్కు ఉందంటూ.. హిందూ సమాజం రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసే స్థాయికి చేరింది. ఈ పరిణామం ప్రపంచదేశాల దృష్టి ఆకర్షించింది. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న భారత్.. ఈవిషయంలో తమ ఆందోళనను కొత్తసర్కార్ దృష్టికి తెచ్చింది. అన్నివిధాలుగా సహకరిస్తామంటూనే.. ఆందోళనలు అదుపుచేయాల్సిందిగా కోరింది.
మరోవైపు అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్యసమితి కూడా బంగ్లాదేశ్ విధ్వంసకాండపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు వీటన్నింటి ఒత్తిడితో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేత యూనస్.. ఆందోళనలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రఖ్యాత ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించి, హిందువులతో సమావేశమయ్యారు. ప్రభుత్వపాత్రపై నిర్ణయానికి వచ్చే ముందు ఓపిక వహించాలన్నారు. అయితే 278 చోట్ల హిందువులపై దాడులు జరిగాయని హిందూ నాయకులు వారికి తెలిపారు. చర్చిలు, ఆలయాలపై దాడులు జరిగితే తెలపాలంటూ ఓ హాట్ లైన్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే… ఈ అల్లర్లను ఆపడంలో బంగ్లా సర్కార్ కానీ విఫలమైతే పరిస్థితి ఏంటి..? అసలు ఎందుకు బంగ్లాదేశ్ సైన్యం ఆందోళనలను నిలువరించలేకపోతోంది. నిజంగానే ఆందోళనలు చేయి దాటుతున్నాయా..? లేదా సైన్యం మదిలో ఇంకేమైనా ఆలోచన ఉందా..? ఇప్పుడీ అంశాలు ప్రపంచదేశాల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.






