శభాష్ మనూ..!
పడిలేచిన కెరటం.. చాలా బలంగా వస్తుంది. దాని దాటికి తీరం అల్లకల్లోలమవుతుంది. అదే పరాేజిత… విజేతగా ఆవిర్భవిస్తే.. ఆమెను కూడా అలానే సంభోదిస్తారు. అలాంటి కోవలోకే వస్తుంది పదిమీటర్ల విమెన్స్ రైఫిల్ కాంస్య పతక విజేత మనూబకర్. భారత్ కు తొలి పతకం( కాంస్యం) సాధించడంతో… ఇప్పుడు దేశమంతా శభాష్ మనూ అంటోంది. రాష్ట్రపతి, ప్రధాని దగ్గర నుంచి క్రీడా పండితుల వరకూ అందరూ ఆమె కృషిని వేనోళ్ల ప్రశంసిస్తున్నారు.
విజయం సాధించడం కంటే.. దాన్ని నిలబెట్టుకోవడం కష్టం.మూడేళ్ల కిందట మను బాకర్‌ను చూస్తే అది నిజమే అనిపించి ఉంటుంది క్రీడాభిమానులకు. ఒలింపిక్స్‌లో ఘోర వైఫల్యం.. అది చాలదన్నట్లు అనవసర వివాదాలతో ఆమె తిరోగమనంలో పయనిస్తున్నట్లే కనిపించింది. కానీ మను అందరిలాంటి అమ్మాయే అయితే ఇప్పుడామె గురించి దేశమంతా మాట్లాడుకునేది కాదు.వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని.. వ్యక్తిత్వాన్ని మార్చుకుని.. తనను తాను సరికొత్తగా మలుచుకుంది కాబట్టే ఒలింపిక్ పతక విజేతగా నిలిచింది.
షూటింగ్‌లోకి అడుగు పెట్టిన మూణ్నాలుగేళ్లకే ప్రపంచకప్‌లో 9 స్వర్ణాలు సాధించడం, ప్రపంచ నంబర్‌వన్ కావడం అంటే మాటలు కాదు. ఇదే ఊపులో ఒలింపిక్స్‌లోనూ అద్భుతాలు చేసేస్తుందని అభిమానులు ఆమెపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ టోక్యోలో మూడు విభాగాల్లో పోటీ పడితే పతకం సాధించడం కాదు కదా, ఒక్కదాంట్లోనూ ఫైనల్ కూడా చేరలేకపోయింది మను. ఒక ఈవెంట్లో ఆమె తుపాకీ మొరాయించడం సమస్యగా మారింది కానీ.. మొత్తంగా టోక్యోలో తన ప్రదర్శన పేలవమే. దీనికి తోడు తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రాణాతో గొడవ పెట్టుకోవడం ఆమెకు చెడ్డ పేరు తెచ్చింది. మరోవైపు ఒలింపిక్స్ తర్వాత కూడా వెంటనే మను ప్రదర్శన మెరుగుపడకపోవడంతో తన కెరీర్ తిరోగమనంలో పయనిస్తున్నట్లే కనిపించింది.
అయితే… మనులోని పతకం సాధించాలన్న బలమైన కాంక్ష ఆమెను తిరిగి సాధనవైపు తీసుకెళ్లింది.సాధనే తన రాత మారుస్తుందని ఒకప్పటికన్నా ఎక్కువగా షూటింగ్ రేంజ్లో గడపడం మొదలుపెట్టింది. మరోవైపు అహం పక్కన పెట్టి తనే జస్పాల్ రాణా దగ్గరికి వెళ్లింది. మళ్లీ అతడి దగ్గర శిక్షణ మొదలుపెట్టింది. టోక్యోలో తన ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడిని తట్టుకోలేకపోవడమే అని గుర్తించి మానసిక దృఢత్వం మీదా దృష్టిసారించింది. దీంతో గత ఏడాది మను ప్రదర్శన ఎంతో మెరుగు పడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించడం తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. ఇప్పుడు పారిస్‌లో పోటీ పడ్డ తొలి ఈవెంట్లోనే కాంస్యం సాధించింది.
చిన్నతనంలో మను అరడజను ఆటల్లో సాధన చేయడం.. అన్నింట్లోనూ జాతీయ స్థాయికి వెళ్లడం విశేషం. మార్షల్ ఆర్ట్స్‌తో మొదలుపెట్టి టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్, వాలీబాల్, క్రికెట్ ఆటలు ఆడింది. వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో ఆమె 60 పతకాలు సాధించడం విశేషం. అయితే టీనేజీకి వచ్చేసరికి ఏదో ఆటలో ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారాలని బాక్సింగ్ వైపు మొగ్గింది. కానీ అందులో కుదురుకోలేదు. అదే సమయంలో తన తల్లి సుమేద ప్రిన్సిపల్‌గా ఉన్న పాఠశాలలో ఉన్న షూటింగ్ రేంజ్ ఆమెను ఆకర్షించింది. అక్కడ వెళ్లి కొన్ని రోజుల సాధనతోనే 10కి 7.5 పాయింట్లు సాధించింది. అది చూసి కోచ్ ఆశ్చర్యపోయాడు. ఆయన సూచన మేరకే మను షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.
2016లో 14 ఏళ్ల వయసులో షూటింగ్ సాధన ఆరంభించింది మను. ఏడాది తిరిగేసరికే ఆటలో మంచి పట్టు సాధించింది. తాను పాల్గొన్న తొలి జాతీయ టోర్నీలోనే ఆమె సంచలనాలు రేపింది. వివిధ విభాగాల్లో ఏకంగా 9 పతకాలు కొల్లగొట్టింది. అప్పటికి దేశంలోనే అత్యుత్తమ షూటర్లలో ఒకరిగా పేరున్న, ఒలింపియన్ కూడా అయిన హీనా సిద్ధును 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఓడించి స్వర్ణం గెలవడం.. ఈ క్రమంలో 242.3 స్కోరుతో జాతీయ రికార్డు నెలకొల్పడంతో షూటింగ్ వర్గాల్లో మను పేరు మార్మోగింది. తర్వాతి ఏడాది ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శన చేసింది. ఒలింపిక్ స్వర్ణ విజేతను ఓడిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది. అప్పటికి మను వయసు 16 ఏళ్లే. కేవలం రెండేళ్ల వ్యవధిలో ఆమె 9 ప్రపంచకప్ స్వర్ణాలు సాధించింది.






